Guntur: వార్డు రిజర్వేషన్లపై అపోహలు వద్దు: కమిషనర్ మయూర్ అశోక్!
Guntur: గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వార్డుల రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ స్పష్టం చేశారు.
Guntur: వార్డు రిజర్వేషన్లపై అపోహలు వద్దు: కమిషనర్ మయూర్ అశోక్!
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ వార్డ్ ల రిజర్వేషన్లపై వివిధ వాట్సప్ గ్రూప్ లు, సోషల్ మీడియాల్లో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థలో 57 వార్డ్ లను 76 లుగా పెంచుతూ మంగళవారం(15వ తేదీ) రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ని ప్రకటించిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు వార్డ్ ల వారీగా గుర్తింపు కార్డ్ ఓటర్ జాబితాను ఈనెల 22వ తేదీ నాటికి ప్రచురించాల్సి ఉందని.
అనంతరం గెజిట్ మేరకు వార్డ్ ల వారీగా కుల గణన చేసి, వివరాలను నిర్దేశిత వెబ్సైటుకి ఆన్ లైన్ లో నమోదు చేస్తామని, తదుపరి ఆన్ లైన్ ద్వారా మాత్రమే వార్డ్ ల రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ నిర్దేశిత ప్రభుత్వ షెడ్యూల్, ఎన్నికల నిబందనల మేరకు మాత్రమే జరుగుతుందని, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇష్టానుసారం చేసుకోవడానికి వీలు కాదన్నారు.
కనుక గుంటూరు నగరపాలక సంస్థకి సంబంధించి వార్డ్ ల రిజర్వేషన్ ప్రక్రియపై వివిధ వాట్సప్, సోషల్ మీడియాల్లో వస్తున్నఅవాస్తవాలను నమ్మవద్దని, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నిరాధార ప్రకటనలు, ప్రచారాలు చేసే వారిపై ఎన్నికల నిబందనల మేరకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.




