Guntur: వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలి!

Guntur: గుంటూరు జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, జనవరి 1 నాటికి మాతృ, శిశు ఆరోగ్య కేంద్రాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Nov 2026 5:49 PM IST
Guntur
X

Guntur: వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలి!

గుంటూరు: జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా (ఔట్ బ్రేక్) సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. డిస్ట్రిక్ట్ జాయింట్ ఔట్ బ్రేక్ రెస్పాన్స్ టీమ్ (డి.జె.ఓ.ఆర్.టి) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా ఏ వ్యాధి ప్రబలినా తక్షణం సమాచారం అందాలన్నారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వ్యాధులు మానవులకు ప్రబలినా లేదా పశువులు, పౌల్ట్రీలకు ప్రబలినా తక్షణం సమాచారం ఇవ్వాలని చెప్పారు.

వ్యాధికి కారణాలు వెంటనే కనుగొనాలని, దానికి తక్షణం వైద్య సహాయం అందించాలని స్పష్టం చేశారు. వ్యాధి భారిన పడిన వ్యక్తి తీవ్రత మేరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పశు సంవర్ధక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గ్రామ పంచాయతీ విభాగం, పురపాలక సంఘం తదితర అన్ని శాఖలు తక్షణం స్పందించి వ్యాధి తీవ్రత వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖలకు అప్పగించిన పనుల్లో ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు.

మాతృ,శిశు ఆరోగ్య కేంద్రాలు సిద్ధం కావాలి

తెనాలిలో గల జిల్లా ఆసుపత్రితో పాటు ప్రత్తిపాడు, పొన్నూరు ఆసుపత్రుల్లో మాతృ,శిశు ఆరోగ్య కేంద్రాలు జనవరి 1 నాటికి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో అత్యున్నత వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు విభాగాలలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి, మంచి వైద్య సేవలకు స్థావరంగా మార్చాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మక్కెన పద్మావతి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, ఎన్.టి.ఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి విజయ ప్రకాష్, వైద్య ఆరోగ్య శాఖ డి.పి.ఎం సుజాత, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN