Guntur: గుంటూరు వసతి గృహాల్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ తనిఖీ
Guntur: గుంటూరులో మహిళా, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. మౌలిక సదుపాయాల కల్పనకు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం.
Guntur: గుంటూరు వసతి గృహాల్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ తనిఖీ
గుంటూరు: జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాలతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మహిళా వసతి గృహాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు.
బుధవారం ఉదయం గుంటూరు నగరంలోని మహిళా ప్రాంగణం, సఖి నివాస్, గిరిజన బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఉద్యోగినిల వసతిగృహం, అనాధ పిల్లలు వసతి గృహం, మహిళా వయో వృద్ధుల వసతి గృహం, పరివార్తన భవన్ లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.
వసతి గృహాల భవనాల స్థితిగతులు, నివాస గదులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, వంటశాల, భద్రతా ఏర్పాట్లు, పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వసతి గృహం భద్రత, పరిశుభ్రత, సౌకర్యాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువు నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనువైన స్థలం పరిశీలించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సైతం చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వసతి గృహాల్లో ఎక్కడైనా మరమ్మత్తులు అవసరమైతే వాటిని వెంటనే చేపట్టాలని, భవనాల బలోపేతం, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, విద్యుత్, ఫర్నిచర్, డ్రైనేజీ, వంటశాలల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
మహిళలు, బాలికల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైన భద్రతా చర్యలు, పరిశుభ్రమైన పరిసరాలు వంటి అంశాలను తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. ప్రతి వసతి గృహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, నివాసితుల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఐ సి డి యస్ పిడి ప్రసూన, ఎస్ సి కార్పొరేషన్ ఈడీ దుర్గాభాయ్, మహిళా శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, వసతి గృహాల నిర్వాహకులు పాల్గొన్నారు.




