Guntur: తెనాలిలో స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన కలెక్టర్!
Guntur: తెనాలి వి.ఎస్.ఆర్ కళాశాలలో స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లు, పంపిణీ కేంద్రాలను గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ గురువారం తనిఖీ చేశారు.
Guntur: తెనాలిలో స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన కలెక్టర్!
గుంటూరు:స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా తెనాలిలో స్ట్రాంగ్ రూమ్ లు, పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ గురువారం తనిఖీ చేశారు. తెనాలి పురపాలక సంఘం ఎన్నికల సామాగ్రి స్వీకరణ, స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ ఏర్పాట్లను వి.ఎస్.ఆర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సైతం తెనాలి డివిజన్ కు సంబంధించి అదే కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, తెనాలి పురపాలక సంఘం కమిషనర్ జె రామ అప్పలనాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. పంపిణీ కేంద్రం వద్ద సామాగ్రి పూర్తి స్థాయిలో ఉండాలని, ఏ సామాగ్రి లోటు ఉండరాదని ఆదేశించారు. ఫలహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను ఎన్నికల సిబ్బందికి చేయాలని అన్నారు. రూట్ ల వారిగా వాహనాలు సిద్ధంగా ఉండాలని, పిఓలు, ఏపిఓలు, సిబ్బంది హాజరు చూడాలని అన్నారు.
ఎన్నికల సామగ్రి స్వీకరణ (రిసెప్షన్) కేంద్రం వద్ద వాహనాల రాకపోకలపై స్పష్టత ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ట్రాఫిక్ జామ్ సమస్య ఉండరాదన్నారు. ఎన్నికల సిబ్బంది వాహనం దిగి నేరుగా రిసెప్షన్ కౌంటర్ వద్ద ఎటువంటి ఆలస్యం లేకుండా సామాగ్రి అప్పగించాలని చెప్పారు. రిసెప్షన్ కౌంటర్ వద్ద తగినంత సిబ్బందిని నియమించాలని సూచించారు. సిబ్బందికి మంచి నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ల వద్ద సిసి కెమెరా ఏర్పాటు పక్కాగా ఉండాలని సూచించారు. మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు. పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కౌంటర్ వద్ద ఎటువంటి అసౌకర్యం, ఆలస్యం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుటకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటర్లకు వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తగు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




