Guntur: గుంటూరులో ఘనంగా తెలుగు అధికార భాషా దినోత్సవం!

Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో గిడుగు రామమూర్తి జయంతి వేడుకలు; ఘనంగా తెలుగు అధికార భాషా దినోత్సవం నిర్వహించిన కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 29 Aug 2026 1:02 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో ఘనంగా తెలుగు అధికార భాషా దినోత్సవం!

Guntur: జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి గిడుగు రామమూర్తి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవహారిక భాష అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది రామమూర్తి పంతులు అన్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషోద్యమం కోసం గ్రాంథికవాదులతో అలుపెరగని పోరాటం చేశారన్నారు. నోటిమాటకు, చేతి రాతకు సంధానం కుదిరినప్పుడే భాషకు మాధుర్యం ఉంటుందని భావించారని చెప్పారు.

పండితులకే పరిమిత మైన భాషను, కొద్ది మంది మాత్రమే చదువుకునే వెసులు బాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని ఆయన పరితపించారని పేర్కొన్నారు. శిష్టవ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడ ఇది సాధ్యమవుతుందని సంప్రదాయ భాషావాదులపై సుదీర్ఘ పోరాటం చేశారని అన్నారు.

ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థమయ్యేరీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు రామమూర్తి గట్టిగా వాదించారన్నారు.

గురజాడ అప్పారావు, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమేకాదు, చక్కటి భావజాలాలను కలబోసుకున్న మిత్రులు అన్నారు. సవర భాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంత డబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లను గిడుగు రామమూర్తి చేశారని తెలిపారు.

ముప్పై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో 'సవర-ఇంగ్లీషు కోశాన్ని తయారు చేశారన్నారు. ఆదిమ సవర జాతి గిరిజనుల భాషకు లిపిని, నిఘంటువును రూపొందించిన మహనీయుడు గిడుగు అన్నారు.

ప్రభుత్వం ఆయనకు కైజర్-ఏ -హింద్' అనే స్వర్ణపతకాన్ని ఇచ్చి గౌరవించిందన్నారు. 1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు' అనే మాసపత్రిక నడిపారని చెప్పారు. తెలుగువారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో ప్రపంచానికి తెలుస్తాయన్నారు.

జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ భాష ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. వ్యవహారిక భాష ఉంటే సాధారణ ప్రజానీకంకు సైతం చేరువ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి,

జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డి.రమాకాంత్, ప్రాంతీయ రవాణా అధికారి కె.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story