Guntur: కొర్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ పర్యటన!
Guntur: గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ కొర్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్ను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం, మహిళల ఫుడ్ ప్రాసెసింగ్పై ఆరా తీశారు.
Guntur: కొర్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ పర్యటన!
గుంటూరు: వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఉన్న రైతు నేస్తం ఫౌండేషన్ ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు, ప్రకృతి వ్యవసాయంలో ఫైవ్ లేయర్ మోడల్ విధానాలు, అచ్చట ఉన్న దేశీయ గోజాతులు - ఒంగోలు, కాంక్రీజ్ , పుంగనూరు, సాహివాల్ , గిర్ ఆవుల గురించి అడిగి తెలుసుకున్నారు.
సేంద్రియ ఎరువులు, ఘన జీవామృతం తయారీ విధానం, కాషాయాలు, జీవామృతం తయారీ విధానం, సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం గురించి అవగాహన చేసుకోవడం, ఆవుల గో మూత్రం, పేడతో వివిధ రకాలైన బై ప్రోడక్ట్స్ - ప్రమిదలు, ధూప్ స్టిక్స్, పిడకలు, వినాయక ప్రతిమల తయారీ పై ఆరా తీశారు.
మహిళలు తమ ప్రాంతంలో వ్యవసాయాధారిత పరిశ్రమలను స్థాపించుటకు తద్వారా ఆర్థికంగా అభివృద్ధి కావదానికి అవకాశాలపై రెండు రోజుల నుండి రైతు నేస్తం ఫౌండేషన్ లో శిక్షణ పొందుతున్న
స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వచ్చిన మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. రైతు నేస్తంలో జరుగుతున్న ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలను పరిశీలించారు. టమాటా సాస్ తయారీ విధానం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం, వేరుశెనగ విత్తనాలు వేరు చేసే యంత్రం, వెన్న తీసే యంత్రం, బూందిలో నుండి ఆయిల్ వేరు చేసే యంత్రం, ఎద్దుల గానుగ నూనె తయారీ, పిండి వంటల తయారీ మెషిన్, మిల్లెట్స్ బిస్కట్స్ తయారీ మెషిన్, గరం మసాలా తయారీ మెషిన్, వెజిటబుల్ కట్టర్ మెషిన్, పాకింగ్ మెషిన్, వాక్యూమ్ పాకింగ్ మెషిన్, మోడల్ ఆర్గానిక్ స్టోర్, బయో రీసెర్చ్ సెంటర్ ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు స్థాయిలో బయోచార్ తయారు చేసే వివిధ రకాల పద్ధతులను తెలుసుకొని, వాటిని రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేసి రైతుల భూముల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచాలని, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వర రావుని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, ప్రకృతి వ్యవసాయం డి.పి.ఎం రాజకుమారి, నాబార్డ్ డి.డి.ఎం శరత్, ఎల్.డి.ఎం మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




