Guntur: గుంటూరులో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం
Guntur: గుంటూరు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ కె. మయూర్ అశోక్ సమీక్ష. రాజకీయ పార్టీల సహకారం కోరిన అదనపు ఎలక్షన్ అథారిటీ.
Guntur: గుంటూరులో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం
గుంటూరు: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని పొలిటికల్ పార్టీలు సహకరించాలని నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పై పొలిటికల్ పార్టీల ప్రతినిధులు మరియు ఆర్.ఓ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అధారిటీ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని, దానిలో భాగంగానే గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితా మరియు ఎస్సీ, ఎస్టీ, మహిళా (బిసి, ఎస్సీ, ఎస్టీ, జనరల్ విభాగాల మహిళలతో సహా), బిసి ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించి మార్క్ చేసిన జాబితాలను శనివారం ప్రచురించుట జరిగిందని, సదరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలకు పంపుట జరిగిందని తెలియచేశారు. వీటికి సంబంధించి రాజకీయ పార్టీలు సూచనలు, సలహాలు మరియు అభ్యంతరాలను ఏమైనా ఉంటె తెలియచేయాలని తెలియ చేయాలన్నారు.
అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుర్తించిన పోలింగ్ స్టేషన్లను ఆర్.ఓ లు రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి, నిబంధనల ప్రకారం సదుపాయాలు అన్నీ ఉన్నాయా లేదా తనిఖీ చేయాలన్నారు. ముఖ్యంగా ఆర్.ఓ లు పోలింగ్ స్టేషన్ల మరమ్మతులు ఏమైనా ఉంటె వెంటనే వాటికి ఇజనేరింగ్ అధికారుల ద్వారా మరమ్మతులు చేయించాలని తెలియచేశారు . రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ఎలక్షన్ షెడ్యులు విడుదల చేస్తుందని, సదరు షెడ్యులు ప్రకారం ఆర్.ఓ లు నిబంధనలు ఫాలో కావాలని, ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను తప్పనిసరిగా పాటించి, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు.
ఎన్నికల నిర్వహణలో సమస్యలేమైనా ఎదురైతే దానికి ఆర్.ఓ లే పూర్తి బాధ్యత వహించాలని, కావున ఆర్.ఓ లు వారికిచ్చిన హ్యాండ్ బుక్ చదివి నిబంధనలు పాటించాలన్నారు. ఆర్.ఓ లు వారికీ కేటాయించిన వార్డులలో స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను తెలియచేయాలన్నారు. ఈ స్థానిక ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల సహకారం ఎంతో ముఖ్యమని, కావున ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల వారు సహకరించాలని కోరారు. అంతేకాక సదరు ఎన్నికలకు సంబంధించి నగర పాలక సంస్థలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని, ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల వారికి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.
సమావేశంలో అదనపు కమిషనర్ ఐ. కిషోర్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాస్, సాంబశివరావు, సిటీ ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్లు నాగమల్లేశ్వరావు, సుధా కిరణ్మయి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్.ఓలు, ఏఆర్ఓలు పాల్గొన్నారు.




