Guntur: గుంటూరులో ఎన్నికల కోడ్: ఉద్యోగుల సెలవులు రద్దు చేసిన కమిషనర్!
Guntur: నగరంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ మయూర్ అశోక్ స్పష్టం చేశారు.
Guntur: గుంటూరులో ఎన్నికల కోడ్: ఉద్యోగుల సెలవులు రద్దు చేసిన కమిషనర్!
Guntur: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) తక్షణమే అమలులోకి వచ్చిందని, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్లో ఆయన అధికారులకు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎంసిసి అమలు దృష్ట్యా గుంటూరు నగరంలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయటంతో పాటు పోస్టర్స్, బ్యానర్స్ తొలగించే చర్యలు ప్రారంబించామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది అంతా 'డబుల్ అలర్ట్'గా ఉండాలని సూచించారు.
కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో సమర్థవంతమైన నిర్వహణ అత్యంత ప్రధానమని, ఉద్యోగులందరికీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సెలవులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల విధులకు సంబంధించిన ఆదేశాలు వాట్సాప్ లేదా అధికారిక గ్రూపులలో పోస్ట్ చేసిన వెంటనే సిబ్బంది తమకు కేటాయించిన విధులకు తక్షణమే హాజరుకావాలని, సమాచారం తెలియదనే సాకులు ఎంతమాత్రం చెల్లవని స్పష్టం చేశారు.
ఉద్యోగులందరూ రాజకీయ తటస్థత వహించాలని, ఏ అభ్యర్థి లేదా రాజకీయ నాయకుడితో ప్రచారాల్లో పాల్గొనడం కానీ, సోషల్ మీడియా వేదికగా రాజకీయ మద్దతు తెలపడం కానీ పూర్తి నిషిద్ధమని స్పష్టం చేశారు.
సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై ఉన్న రాజకీయ పోస్టర్లు, బ్యానర్లను వెంటనే తొలగించాలని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు లేదా కానుకల పంపిణీ వంటివి జరుగుతున్నట్లు దృష్టికి వస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి పనికి కేటాయించిన గడువును పాటిస్తూ వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, పోలింగ్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల లోపల ప్రచారాలకు తావులేకుండా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు అత్యంత ప్రాధాన్యమైనవి అయినప్పటికీ దైనందిన రెగ్యులర్ ప్రభుత్వ పనులు ఆగిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.




