Guntur: గుంటూరు జిల్లాకు తుఫాను ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్!

Guntur: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 16 Nov 2026 7:51 AM IST
Guntur
X

Guntur: గుంటూరు జిల్లాకు తుఫాను ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్!

Guntur: రానున్న తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా మండల స్థాయి కార్యాలయం వరకు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 ఫోన్ నంబర్ తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, అందులో ఎవరు నివసించరాదని విజ్ఞప్తి చేశారు.

చెరువులు, వాగులు, వంకల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, దాటుటకు ప్రయత్నించవద్దని కోరారు. తడిగా ఉన్న కరెంటు స్తంభాలను ముట్ట వద్దని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సియం.సాయికాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. "టీం గుంటూరు"గా తుఫానుపై విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారుతుందన్నారు. నవంబరు 18 నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని,19వ తేదీన 18 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగలదని అంచనా ఉందని, 20వ తేదీన వర్షాలు కురుస్తాయని ఆర్.టి.జి.ఎస్ సూచనలు జారీ చేసిందని చెప్పారు.

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వివరాలు గుంటూరు నగరపాలక సంస్థ, ఇతర మున్సిపాలిటీలలో సిద్ధం చేసి చేపట్టాల్సిన చర్యలను సమీక్షించాలని ఆదేశించారు. గాలులకు హోర్టింగులు, చెట్లు కూలిపోయే పరిస్థితి ఉంటుందని, వాటిని తొలగించాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలు, అండర్ పాస్ ల వద్ద నీరు నిలువ ఉండే అవకాశం ఉందని, ఆ ప్రాంతాల్లో ముందుగానే ఆయిల్ ఇంజిన్ లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు

జలవనరుల శాఖ ప్రతీ వాగు, కాలువలను ముఖ్యంగా నల్లమడవాగు, కొండవీటివాగు తదితర వాగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వలు, వివిధ వాగుల ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో వాటిని గుర్తించాలని, అటువంటి చోట్ల ఇసుక బస్తాలు సిద్ధం వేయాలని ఆదేశించారు. అర్నాబ్, మురసు తుఫాన్లకు గండిపడిన చోట్ల వెంటనే ఇసుక బస్తాలు వేసి పూడ్చాలని ఆదేశించారు.

పరిస్థితిని అనుసరించి తక్షణం ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పూర్తి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురపాలక సంఘాలు, గ్రామాల్లో సైతం తాగునీటి సమస్య తలెత్త రాదని అన్నారు.

తాగునీటి పథకాలు వద్ద జనరేటర్లు సిద్ధంగా పెట్టుకోవాలని ఆదేశించారు. త్రాగునీరు ఎటువంటి పరిస్థితుల్లో కలుషితం కాకుండా స్పష్టమైన పర్యవేక్షణ జరగాలని అన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వలన రవాణాకు ఆటంకం జరక్కుండా ట్రీ కట్టర్స్, పవర్ సాస్ లను సిద్ధంగా పెట్టాలని రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు.

విపత్తు నిర్వహణ శాఖ అన్ని పరికరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. విద్యుత్తు స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరణ చేసి విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. తాడికొండ వద్దగల 220 కెవి, ఇతర ప్రాంతాల్లో ఉన్న 33 కెవి సబ్ స్టేషన్ ల వద్ద నీరు చేరి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

టెలికాం, మొబైల్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సంబంధిత టెలికం కంపెనీలు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలో అన్ని బంకుల్లో ఇంధనం పూర్తిస్థాయిలో ఉండే విధంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులు పూర్తిస్థాయిలో అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద ఆహార తయారీ కోసం ఏజెన్సీలను సిద్ధం చేసి తక్షణ ఆహార పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తుఫాన్ పట్ల రైతులను అప్రమత్తం చేయాలని అవసరమైన సూచనలు సలహాలను అందించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖలను ఆదేశించారు. పశువులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వాటికి తగిన ఆహారము అందే విధంగా పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఆసుపత్రుల వద్ద విద్యుత్ ఆటంకం లేకుండా చూడాలి

ఆసుపత్రుల వద్ద ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్ల వద్ద ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. హై రిస్క్ లో ఉన్న గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. వైద్య సేవలకు ఎటువంటి అంతరాయము ఉండరాదని స్పష్టం చేశారు.

వాగులు, వంకలు, నదులు దాటవద్దు

వాగులు, వంకలు, నదులు ఎవరు దాటవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాను తీవ్రత ఉండటం, నీటి ప్రవాహాలు పెరగటం జరుగుతుందని చెప్పారు. జల ప్రవాహాలు దగ్గర ఈతకు వెళ్లడం, సాధారణ పనులు చేయుటకు వెళ్లడం ఉండరాదని, దీనిపట్ల గ్రామాల్లో దండోరా వేయించి తెలియజేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ మనుషుల ప్రాణాలు గానీ, పశువుల ప్రాణాలు గానీ, ఆస్తుల నష్టంగాని జరగరాదని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ,జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN