Guntur: బాలల రక్షణ అనేది ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన బాధ్యత!

Guntur: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాలల దినోత్సవం నిర్వహించి బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 13 Nov 2026 6:42 PM IST
Guntur
X

Guntur: బాలల రక్షణ అనేది ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన బాధ్యత!

గుంటూరు: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు, క్యాలెండరు ఆక్టివిటీస్ లో భాగంగా 14.11.2026 న జరపవలసిన బాలల దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రపంచ బాలల దినోత్సవాన్ని నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని కేవలం ఒక వేడుకగా జరుపుకోవడం కాదని, బాలల హక్కులు, వారి భద్రత, సంక్షేమం, విద్య, ఆరోగ్యం మరియు సమగ్ర అభివృద్ధి పట్ల మన బాధ్యతలను గుర్తుచేసుకోని వాటి పరిరక్షణకు మనమందరం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.

ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే, ఆ దేశంలోని బాలలకు ఎలాంటి బాల్యం లభిస్తోందో చూడాలని , ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన బాల్యం లభించినప్పుడే దేశం నిజమైన అభివృద్ధిని సాధించినట్లని బాల్యంలోనే పిల్లల వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, నైతిక విలువలు మరియు భవిష్యత్తుకు సంబంధించిన పునాదులు ఏర్పడతాయని.

అందువల్ల బాలల సంరక్షణ అనేది కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు అది సమాజం, ప్రభుత్వం మరియు ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. మన భారత రాజ్యాంగం బాలల హక్కులకు విశేషమైన ప్రాధాన్యతను ఇచ్చిందని అందులో ప్రధానంగా ఆర్టికల్ 14 – చట్టం ముందు సమానత్వాన్ని,ఆర్టికల్ 15(3) – మహిళలు మరియు బాలల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వానికి అధికారాన్ని, ఆర్టికల్ 21 – జీవించే హక్కుతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కును పరిరక్షిస్తుందని, ఆర్టికల్ 21-A – 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుందని, ఆర్టికల్ 23 – మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమను నిషేధిస్తుందని,

ఆర్టికల్ 24 – 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకరమైన పరిశ్రమలు మరియు పనుల్లో నియమించడాన్ని నిషేధిస్తుందని, ఆర్టికల్ 39(e) మరియు 39(f) – బాలల ఆరోగ్యం, శక్తి దుర్వినియోగం కాకుండా చూడటం, వారి గౌరవప్రదమైన అభివృద్ధికి అవకాశాలు కల్పించడం వంటి అంశాలను ప్రభుత్వ విధాన నిర్దేశక సూత్రాలుగా పేర్కొంటాయని ,ఆర్టికల్ 45 – చిన్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య అందించడంపై దృష్టి సారిస్తుందని, ఆర్టికల్ 51-A(k) – 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ప్రాథమిక విధిగా పేర్కొంటుందని,అంతేకాకుండా, ఆర్టికల్ 39-A ప్రకారం సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యతను రాజ్యాంగం నిర్దేశించిందని.

ఈ రాజ్యాంగ నిబంధనల ప్రకారం బాలల రక్షణ అనేది కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని అది రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు. ప్రతి బిడ్డకు ప్రధానంగా నాలుగు రకాల హక్కులు కల్పించాలని మొదటిది – జీవించే హక్కు,రెండవది – అభివృద్ధి హక్కు,మూడవది – రక్షణ హక్కు,నాలుగవది – భాగస్వామ్య హక్కు ఈ నాలుగు హక్కులు పరస్పరం అనుసంధానమై ఉండి ఇందులో ఏ ఒక్క హక్కును నిర్లక్ష్యం చేసినా పిల్లల సంపూర్ణ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని అన్నారు.

మరియు బాలల రక్షణకు సంబంధించిన ముఖ్యమైన చట్టాల గురించి వివరించారు. అందులో పోక్సో చట్టం 2012, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్స్ Act, 2015, రైట్ అఫ్ చిల్డ్రెన్ టు ఫ్రీ అండ్ కంపల్సరి ఎడ్యుకేషన్ చట్టం 2009, చైల్డ్ అండ్ ఆడోలసెంట్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ ) చట్టం 1986, ప్రొహిబిషన్ అఫ్ చైల్డ్ మ్యారేజ్ చట్టం , 2006 ,ఈ చట్టాలు పుస్తకాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలైనప్పుడే వాటి ఉద్దేశ్యం నెరవేరుతుందని.

ఒక బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు, ఆ బిడ్డకు తక్షణ సహాయం అందేలా ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బాలల రక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం పాత్ర కూడా ఎంతో కీలకమైనది. పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి. వారి సమస్యలను ఓపికగా వినాలి. వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించాలి. వారు ఏదైనా సమస్యను చెప్పినప్పుడు దానిని తేలికగా తీసుకోకుండా, వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి.

అదే సమయంలో వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చట్టాల పట్ల అవగాహన, సామాజిక బాధ్యత, మానవత్వం మరియు సమిష్టి కృషి ద్వారానే అది సాధ్యమవుతుందని ,బాలల సంక్షేమమే దేశ సంక్షేమం. బాలల అభివృద్ధే దేశ అభివృద్ధి. బాలల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వాసంతి మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి సదుపాయాలు కావాలి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాళ్లకు చట్టం ద్వారా హక్కులను కల్పించాలని 0 నుండి 18 సంవత్సరాల వరకు పిల్లలను మనం బలాలుగా పరిగణిస్తామని పిలల్లకు ఆహారం , విద్య , వైద్యం సరిగా అందుతున్నాయో లేదో చూడాలని అంగన్వాడీల ద్వారా పిల్లలకు సరైన విద్య మరియు చదువు అందుతుందని తెలిపారు. మరియు పిల్లలకు వున్న హక్కులపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం చీఫ్ సురేష్ బాబు మరియు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మధుబాబు బాలలకు ఉన్న హక్కులపై చట్టాలపై మరియు వారి భవిష్యత్తుకు తెసుకోవాల్సిన తగు జాగ్రత్తలను విపులంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో అన్ని స్టేక్ హోల్డర్ సంస్థలవారు , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం స్టాఫ్ , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్టాఫ్ , పారా లీగల్ వాలంటీర్స్ ,సచివాలయం స్టాఫ్ ప్రజలు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN