Guntur: గుంటూరు ఈస్ట్ 2, 3, 4 డివిజన్లలో ఎమ్మెల్యే నసీర్ జోరుగా ప్రచారం!
Guntur: గుంటూరు తూర్పు 2, 3, 4 డివిజన్లలో కూటమి అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ ప్రచారం. రెండేళ్లలో నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి చేశామని వెల్లడి.
Guntur: గుంటూరు ఈస్ట్ 2, 3, 4 డివిజన్లలో ఎమ్మెల్యే నసీర్ జోరుగా ప్రచారం!
గుంటూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. శనివారం రాత్రి 2, 3, 4 డివిజన్లలో కూటమి బలపరిచిన కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు షేక్ షహీనా,షేక్ షబానా, ఐలా అనితతో కలిసి ఎమ్మెల్యే నసీర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లలో కనీసం రోడ్లకు కూడా నోచుకోని తమ ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చిన ఎమ్మెల్యే నసీర్ కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాల గురించి ఎమ్మెల్యే నసీర్ ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తాము కట్టుబడి పని చేస్తున్నామన్నారు. మైనార్టీల అభ్యున్నతికి విరివిగా రుణాల అందిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నామని తెలిపారు.
విద్యుత్, మంచి నీటి సరఫరా, శానిటేషన్ వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమరావతి పునర్నిర్మాణం చేపట్టామని, పోలవరం పనుల పురోగతి సాధించామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామన్నారు. రెండేళ్ల కాలంలో ఇచ్చిన హామీలలో అత్యధిక శాతం నెరవేర్చామని, సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ప్రజలకు అభివృద్ధి, ఆరోగ్యం, ఆహ్లాదం అందించడమే తన లక్ష్యంగా పని చేస్తున్నానని, దీనికి మరింత మద్దతు నిలవాలని కోరారు. స్థానిక కాకుమానువారితోటలోని వెల్ఫేర్ స్థలంలో నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం, పొన్నూరు రోడ్డులోని ఖాళీ స్థలాల్లో వాకింగ్ ట్రాక్, పార్కు, క్రీడా ప్రాంగణం నిర్మాణానికి రూ.5.70 కోట్లతో శంకుస్థాపన చేశామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దాతల సహకారంతో వెల్ఫేర్ స్థలంలో అద్భుతమైన క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణానికి కనీసం తట్టమట్టి కూడా వేయలేదని మండిపడ్డారు. నందివెలుగు బ్రిడ్జి వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తున్నామని తెలిపారు. 50 వేల మంది ప్రజలకు ఉపయోగపడే ఈ బ్రిడ్జి గురించి వైసీపీ హయాంలో పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. దీంతోపాటు మొండిగేటు నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడు లేనివిధంగా అభివృద్ధిని చేసి చూపించామని, ప్రజలు కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.




