Guntur: గుంటూరు తూర్పులో రూ.1.46 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Guntur: గుంటూరు తూర్పులో 76 మందికి రూ.1.46 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నసీర్ పంపిణీ చేశారు. పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని స్పష్టం.
Guntur: గుంటూరు తూర్పులో రూ.1.46 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Guntur: ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. మంగళవారం స్థానిక తూర్పు కార్యాలయంలో 76 మందికి రూ.1.46 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిరుపేదల ప్రాణాలను నిలబెట్టడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని చెప్పారు.
నియోజకవర్గంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ సరైన వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని వేగవంతంగా అందిస్తోందన్నారు. గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందడంలో తీవ్ర జాప్యం జరిగేదని, అయితే ఇప్పుడు దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి నేరుగా బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.
క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది అప్పులపాలైన కుటుంబాలకు ఈ సహాయం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆర్థిక సహాయం అందుకోవడంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయాన సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నసీర్ కొండంత అండగా నిలిచారని బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.




