Guntur: భారత్ పేట మున్సిపల్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే నసీర్!

Guntur: గుంటూరు తూర్పు 54వ వార్డులో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. భారత్ పేట మున్సిపల్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులు, అధికారులతో మాట్లాడారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Oct 2026 9:25 AM IST
Guntur
X

Guntur: భారత్ పేట మున్సిపల్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే నసీర్!

Guntur: మంచి మార్కులు తెచ్చుకుని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గిఫ్ట్ ఇస్తారా ?’’ అని విద్యార్థులతో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ముచ్చటించారు. మంగళవారం స్థానిక 54వార్డులో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. అందులో భాగంగా భారత్ పేట మున్సిపల్ పాఠశాలను డీఈవో షేక్ సలీం బాషా, ఎంఈవో ఖుద్దూస్ తో కలిసి సందర్శించారు.

పాఠశాలలో మరుగుదొడ్లు, వంట గది, పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాటామంతీ కలిపారు. పాఠశాలలో విద్యా విధానం, విద్యార్థుల ప్రోగ్రెస్ గురించి ఆరా తీశారు. పాఠశాలకు ఏమేమి సదుపాయాలు కావాలో ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో ప్రస్తుతం 600 మంది వరకు విద్యార్థులు ఉన్నారని, అదనపు తరగతి గదులు అవసరమని ఎమ్మెల్యే నసీర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై డీఈవో, ఎంఈవోలతో ఎమ్మెల్యే నసీర్ చర్చించారు. వీటితోపాటు పాఠశాలలకు అవసరమైన మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. దాతలు, ప్రభుత్వ సహకారంతో పాఠశాలను తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.

పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. విద్యా కిట్లు, పాఠ్య పుస్తకాలు అందించడంతోపాటు తల్లికి వందనం ద్వారా విద్యార్థుల భవితకు భరోసానిస్తున్నట్లు చెప్పారు. కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవపల్ మెంట్ లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

54 వార్డులో పర్యటన

స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ 54వ వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి శానిటేషన్, మంచినీటి సరఫరా వంటి అంశాలపై ఆరా తీశారు. కొందరు నీరు దుర్వాసన వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నీటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, క్లోరినేషన్ సక్రమంగా జరగాలని ఆదేశించారు. శానిటేషన్ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. డ్రెయిన్లలో సిల్ట్ తీత పనులు చేపట్టాలని సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN