Guntur: గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం
Guntur: గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఏకగ్రీవ ఎన్నిక; 76 మంది కార్పొరేటర్ల ప్రమాణం.
Guntur: గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం
గుంటూరు: గుంటూరు నగర మేయర్‌గా శ్రీమతి కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి సి.ఎం. సాయికాంత్ వర్మ మేయర్‌తో పాటు నగరంలోని 76 మంది కార్పొరేటర్లతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో 76 మంది కార్పొరేటర్లు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించగా, 64వ వార్డు కార్పొరేటర్ యర్రంశెట్టి రాజేష్ ఎన్నికయ్యారు. 24వ వార్డు కార్పొరేటర్ నిమ్మల వెంకట రమణ ఆయన పేరును ప్రతిపాదించగా, 45 మరియు 6 వ వార్డు కార్పొరేటర్లు ముత్తినేని రాజేష్, ఇర్రి సాయి బలపరిచారు. ఈ పదవికి మరెవరూ పోటీలో లేకపోవడంతో యర్రంశెట్టి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ ప్రకటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ మాట్లాడుతూ మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ప్రజల చేత నేరుగా మేయర్‌గా ఎన్నికైన శ్రీమతి కోవెలమూడి లక్ష్మి అపర్ణకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. గుంటూరు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కార్పొరేటర్లందరితో కలిసి పనిచేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. నగర అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మరోసారి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరు నగరాన్ని దేశంలోనే అత్యుత్తమ కార్పొరేషన్లలో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యం
.....గుంటూరు నూతన మేయర్ కోవెలమూడి లక్ష్మి అపర్ణ
అనంతరం నూతన మేయర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన గుంటూరు నగరపాలక సంస్థకు మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని అన్నారు. తనపై నమ్మకం ఉంచి మేయర్‌గా సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్, బీజేపీ పెద్దలకు, కేంద్ర మంత్రి చంద్రశేఖర్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
గుంటూరు నగర ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించడమే తన ముఖ్య ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. గుంటూరు నగరాన్ని దేశంలోని అత్యుత్తమ నగరపాలక సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దడం, నగరంలోని ప్రతి ఇంటికీ అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడం తమ సమష్టి లక్ష్యమని, అదే తమ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అని స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో నగర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొంటూ, తనకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చంద్రగిరి ఏసురత్నం, శాసనసభ్యులు నజీర్ అహ్మద్, గళ్ళా మాధవి, బూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్, ఇతర నాయకులు తదితరులు హాజరయ్యారు.




