Guntur: గుంటూరులో బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్
Guntur: గుంటూరులో బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, కమిషనర్ కె. మయూర్ అశోక్.
Guntur: గుంటూరులో బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్
గుంటూరు: గుంటూరు నగరంలోని బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నిలిచిపోయిన పెండింగ్ పనులను సైతం త్వరలోనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ నసీర్‌తో కలిసి ఆయన బిఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్టేడియంలో సీసీ డ్రైన్లు, వాకింగ్ ట్రాక్‌లు, క్రీడా కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా సమగ్ర డీపీఆర్‌లను సిద్ధం చేసి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో స్టేడియంలోకి నీరు చేరడం, వాకింగ్ ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడం వల్ల వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై శాశ్వత పరిష్కారం చూపేలా ఈ చర్యలు చేపట్టామన్నారు. యువత, క్రీడాకారులకు మెరుగైన వాతావరణం కల్పించేలా బీఆర్ స్టేడియంను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యేతో కలిసి చంద్రబాబు నాయుడు కాలనీ, సాయిబాబా కాలనీ, హుస్సేన్ నగర్, నూర్ మసీద్ స్ట్రీట్, సాయి కృష్ణ నగర్, ఆనంద్‌పేట, కిడ్వాయి నగర్, రౌఫ్ నగర్ ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేందుకు పొన్నూరు రోడ్డులోని స్థలాన్ని పరిశీలించారు. ఈ పార్కులో వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలు, చిన్నారుల ఆటస్థలాలు ఏర్పాటు చేసి, అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ మాట్లాడుతూ, బిఆర్ స్టేడియం అభివృద్ధి పనులతో పాటు కొత్త పార్కు నిర్మాణంలో ఎలాంటి తాత్సారం వహించవద్దని కోరారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. పర్యటనలో ఎస్ఈ జి.వేంకటేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ చైతన్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.




