Guntur: డాక్టర్ మంగాదేవి సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నన్నపనేని మంగాదేవి మృతికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళి; చోడవరంలో కుటుంబ సభ్యులకు పరామర్శ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Nov 2026 11:35 PM IST
Guntur
X

Guntur: డాక్టర్ మంగాదేవి సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు: విద్యార్థుల భవిష్యత్తుకు ఆశాజ్యోతిగా నిలిచిన డాక్టర్ మంగాదేవి సేవలు చిరస్మరణీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గుంటూరు విద్యారంగంలో విశేష సేవలందించిన శ్రీ వెంకటేశ్వర బాలకోటి ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నన్నపనేని మంగాదేవి శుక్రవారం చోడవరంలోని చేతన ఫౌండేషన్ ఆవరణలో కన్నుమూయడం పట్ల గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చోడవరంలోని చేతన ఫౌండేషన్‌కు చేరుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ...

ప్రముఖ విద్యావేత్తగా, విద్యారంగంలో విశేష సేవలందించిన మంగాదేవి తెనాలి ప్రాంత ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అనేకమందికి సుపరిచితులని, విద్య, పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబం, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తారని, కానీ మంగాదేవి గారు మాత్రం తన జీవితాన్ని పూర్తిగా సమాజానికి అంకితం చేసి, భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేశారని అన్నారు.

ఎందరో విద్యార్థులకు, పేద కుటుంబాలకు ఆశాజ్యోతిగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మంగాదేవి గారని కొనియాడారు. ఆమె అందించిన సేవలు అపారమని, సమాజానికి ఆమె చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు.

బాలకుటీర్ విద్యాసంస్థలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా, విద్యారంగంలో ఎన్నో పోటీలు ఉన్నప్పటికీ తమ విలువలు, ఆశయాలకు కట్టుబడి నిర్వహించడం మంగాదేవి గారి ప్రత్యేకత అని తెలిపారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఎలాంటి ఒత్తిడి లేని విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఆమె పనిచేశారని, ఆ విధానంతోనే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారని అన్నారు.

మంగాదేవి గారు చూపిన మార్గం, ఆమె నెలకొల్పిన విద్యా విలువలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను కొనసాగిస్తూ బాలకుటీర్ విద్యాసంస్థలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విద్యాసంస్థలను స్థాపించాలనుకునే వారు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకునే వారు మంగాదేవి గారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

మంగాదేవిని అభిమానించే ఎంతోమంది చివరి చూపు కోసం తరలివచ్చి నివాళులర్పించడం చూస్తుంటే, వారందరి అభిమానంలో మంగాదేవి గారు సజీవంగా కనిపిస్తున్నారన్నారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, సమాజానికి అందించిన సేవలు, విద్యారంగంలో వేసిన అడుగుజాడలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొంటూ, మంగాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN