Guntur: బాల కార్మికులు కనిపిస్తే చర్యలు ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Guntur: గుంటూరు మిర్చి గోడౌన్లలో బాల కార్మికులను పనికి పెడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Guntur: బాల కార్మికులు కనిపిస్తే చర్యలు ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కామాక్షి నగర్ మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో బాల కార్మికులను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. మిర్చి గోడౌన్లు, పాకల్లో బాల కార్మికులు కనిపిస్తే గోడౌన్ యజమానులు, మేస్త్రీలు, తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.25వ డివిజన్ కామాక్షి నగర్‌లో బుధవారం మిర్చి తొడిమల గోడౌన్లలో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు, మేస్త్రీలు, గోడౌన్ యజమానులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చిన్నారులను పనులకు వినియోగించడం శిక్షార్హమైన నేరమని అన్నారు. పిల్లలను పనులకు తీసుకురావడాన్ని గోడౌన్ యజమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిని చదువుల వైపు మళ్లించాలని కోరారు. చిన్న వయసులోనే పనులకు అలవాటు చేయడం వల్ల వారు విద్యకు దూరమై భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పారు.
ఒక ఏడాది పాటు ప్రత్యేక పర్యవేక్షణ
కామాక్షి నగర్ మిర్చియార్డు ప్రాంతంలో వచ్చే ఏడాది పాటు చైల్డ్ లేబర్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లలను పనులకు పంపించే తల్లిదండ్రులు, అవకాశం కల్పించే గోడౌన్ యజమానులు, మేస్త్రీలపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
సీజనల్ హాస్టళ్లను సమర్థంగా నిర్వహించాలి
ఒడిశా నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్లలు చదువులకు దూరం కాకుండా సీజనల్ హాస్టళ్లు, విద్యా సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, అర్హులైన పిల్లలందరికీ వసతి, విద్యా అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
శానిటేషన్‌పై రాజీ లేదు
మిర్చి తొడిమల వ్యర్థాలను గోడౌన్ ప్రాంగణాల వెలుపల పడేయడం వల్ల శానిటేషన్ సమస్యలు తీవ్రమవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తొడిమలు, వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా తగిన విధంగా నిర్వహించాలని సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శానిటేషన్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
కార్మికులకు మరుగుదొడ్లు తప్పనిసరి
గోడౌన్లలో పనిచేసే కార్మికులకు, ముఖ్యంగా మహిళలకు తగిన మరుగుదొడ్ల సదుపాయం కల్పించాల్సిన బాధ్యత యజమానులదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్మికుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి గోడౌన్‌లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని కోరారు.
అనంతరం మీడియాతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... చైల్డ్ లేబర్, విద్య, శానిటేషన్, లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు, గోడౌన్ యజమానులు, కార్మికులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గోడౌన్ యజమానులు, మేస్త్రీల వివరాలను సేకరించామని, ఇకపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి మొహమాటం ఉండదన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




