Guntur: ప్రచార అనుమతులకు సింగిల్ విండో: కమిషనర్ మయూర్ అశోక్!

Guntur: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచార ర్యాలీలు, వాహనాలకు రోజూ సింగిల్ విండో ద్వారా అనుమతులు తీసుకోవాలని కమిషనర్ కే. మయూర్ అశోక్ స్పష్టం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 23 Oct 2026 11:48 PM IST
Guntur
X

Guntur: ప్రచార అనుమతులకు సింగిల్ విండో: కమిషనర్ మయూర్ అశోక్!

గుంటూరు: ఎన్నికల్లో భాగంగా మేయర్, కార్పొరేటర్ అభ్యర్ధులు ప్రచార ర్యాలీలు, సభలు, వాహనాలకు అనుమతులు ఏరోజుకి ఆరోజు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సింగిల్ విండో కౌంటర్ ద్వారా తీసుకోవాల్సిందేనని, అనుమతుల కోసం ముందుగా సంబందిత ప్రాంతం డిఎస్పీ అనుమతి పత్రంతో అర్జీలు దాఖలు చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మేయర్ మరియు కార్పొరేటర్ అభ్యర్థులు నిర్వహించే బైక్ ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం (డోర్ టు డోర్) మరియు రోడ్ షోలకు సంబంధించిన అనుమతులను ఆయా ప్రాంతాల డిఎస్పీల నివేదికలు మరియు అభిప్రాయాల ఆధారంగానే మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

ఈ ప్రచార అనుమతులన్నీ కూడా ఖచ్చితంగా రోజువారీగా, నిర్ణీత మార్గం మరియు సమయానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఈ ప్రక్రియను అభ్యర్థులకు వేగవంతంగా మరియు సులభతరం చేసేందుకు సింగిల్ విండో కౌంటర్ ప్రతిరోజూ నిరంతరాయంగా పనిచేసేలా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అలాగే అభ్యర్థులు ప్రచారం కోసం ఉపయోగించే వ్యక్తిగత వాహనాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు మంజూరు చేస్తారని, అదేవిధంగా, మైకులు మరియు లాడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసుకునే ఇతర ప్రచార వాహనాలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో కౌంటర్ ద్వారా అందజేస్తారని తెలిపారు.

వ్యక్తిగత వాహనాలు మరియు మైకులు అమర్చిన ప్రచార వాహనాలకు ఇచ్చే ఈ రెండు రకాల అనుమతులు 25.10.2026 మధ్యాహ్నం 3:00 గంటల నుండి అమలులోకి వస్తాయని, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సహకరించాలని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN