Guntur: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే ఘనవిజయం

Guntur: గుంటూరులో కూటమి పార్టీల సమన్వయ కమిటీ భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమైక్యంగా పనిచేసి వంద శాతం విజయమే లక్ష్యమని నేతల స్పష్టీకరణ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Sept 2026 9:19 PM IST
Guntur
X

Guntur: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే ఘనవిజయం

గుంటూరు: గుంటూరు పట్టణంలోని హోటల్ సిగ్నేచర్ డైన్ వేదికగా శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీ నేతల సమన్వయ కమిటీ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి నాయకులు సంయుక్తంగా పాల్గొని, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు,నాయబ్ కమల్, బిట్రగుంట మల్లిక, తెలుగుదేశం పార్టీ తరఫున మంతెన సత్యనారాయణ రాజు, పిల్లి మాణిక్యాల రావు, అలాగే బీజేపీ నేతలు వల్లూరు జయప్రకాష్ నారాయణ, చెరుకూరి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులంతా సమైక్యంగా పనిచేసి, వంద శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ముక్తకంఠంతో కూటమి నేతలు నిర్ణయించారు.కూటమి ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, పార్టీలకంటే కూటమి అభ్యర్థుల గెలుపే ముఖ్యమనే ధ్యేయంతో క్షేత్రస్థాయిలో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై పార్టీల అధినేతల నిర్ణయానుగుణంగా స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయి పరిస్థితులు, బలాబలాలపై ఇప్పటికే సమగ్ర నివేదికలు సిద్ధం చేశామని, ఎలాంటి పొరపొచ్చాలకు, అపార్ధాలకు తావులేకుండా సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొంటామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN