Guntur: పురుగు మందుల నాణ్యత, నిల్వలు, పంపిణీపై నిరంతర నిఘా
Guntur: గుంటూరు జిల్లాలో పురుగు మందుల నాణ్యతపై వ్యవసాయ శాఖ నిఘా. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని డీఏఓ ఎం. పద్మావతి హెచ్చరిక.
Guntur: పురుగు మందుల నాణ్యత, నిల్వలు, పంపిణీపై నిరంతర నిఘా
గుంటూరు: పురుగు మందుల నాణ్యత, నిల్వలు, పంపిణీపై వ్యవసాయ శాఖ నిరంతర నిఘాతో పని చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి తెలిపారు. శుక్రవారం ఒక దిన పత్రికలో "కాలం చెల్లిన మందులకు.. కొత్త లేబుళ్లు..!" శీర్షికన
ప్రచురితమైన వార్తకు పద్మావతి స్పందిస్తూ వివరణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా తయారీ యూనిట్ లను, గోదాములు, డీలర్ పాయింట్లలో రికార్డులు, బ్యాచ్ నెంబర్లు, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు (AOs), అసిస్టెంట్ డైరెక్టర్లు (ADAs) తనిఖీ చేస్తున్నారని చెప్పారు.
ప్రతి సంవత్సరం జిల్లాలో శత శాతం లక్ష్యాలతో పురుగు మందుల నమూనాల సేకరణ జరుగుతోందని వివరించారు. ప్రస్తుత 2026 - 27 సంవత్సరానికి 1,015 నమూనాల వార్షిక లక్ష్యానికి సంబంధించి క్షేత్ర స్థాయి అధికారులు నమూనాలు సేకరించి నాణ్యతా ప్రమాణాల విశ్లేషణకు నమూనాలను కోడింగ్ సెంటర్ కు పంపించడం జరుగుతోందని చెప్పారు.
జిల్లాలో ప్రస్తుత ఖరీప్ సీజన్ లోను, రాబోవు రబీ పంట కాలములో అన్నీ తయారీ యూనిట్లు, డిస్ట్రిబ్యూటర్ల పాయింట్లు, డీలర్ పాయింట్లను పూర్తిగా తనిఖీలు చేసి నిబంధనలు పాటించని డీలర్లపై పురుగు మందుల చట్టం 1968 ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
గడువు ముగిసిన పురుగు మందులను ప్రత్యేకంగా నిల్వ వుంచి వాటిని సరైన పద్ధతిలో నిర్వీర్యం చేయవలసి ఉందన్నారు. గడువు ముగిసిన పురుగు మందులను ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేసి విడిగా ప్రత్యేకంగా వుంచడం జరుగుతుందని చెప్పారు. గడువు దగ్గరగా వున్న పురుగు మందులను దుకాణదారులు ఆయా కంపనీలకు తిరిగి పంపడం జరుగుతుందని వివరించారు.
ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్-1968 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినా, మిస్బ్రాండెడ్ మరియు గడువు ముగిసిన మందుల అమ్మకాలకు యత్నించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అటువంటి దుకాణాలు/ సంస్థల లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో వ్యవసాయ శాఖ పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోందన్నారు.
జిల్లాలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి పట్టణ, మండల స్థాయిలో అన్ని పురుగు మందుల దుకాణాలను, తయారీ కేంద్రాలను, ట్రాన్స్ పోర్టు ఆఫీసులను, అనుమానిత ప్రదేశాల్ని తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా శుక్రవారం కూడా తనిఖీలు తమ అధికారులు నిర్వహించారన్నారు.
పురుగు మందుల నాణ్యతలో లోపాలు ఉన్నట్లు గమనించినా లేదా ధరలపై అనుమానం వచ్చినా రైతులు వెంటనే వ్యవసాయాధికారికి గానీ లేదా జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో గానీ ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు తనిఖీలు చేపట్టి సంబంధిత పురుగు మందుల డీలర్ పై పురుగు మందుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
పురుగు మందుల డబ్బా/ పాకెట్ పై, తయారీదారైన కంపెనీ, మార్కెటర్, తయారీ తేదీ, ఎక్స్బైరీ తేదీ వంటి వివరాలు పొందుపరచడం జరుగుతుందని అన్నారు. ఈ లేబుళ్ల ఆధారంగా రైతు కావలసిన పురుగు మందును కొనుగోలు చేస్తారని, సంబంధిత వ్యవసాయాధికారులు.
పైవివరాలను తనిఖీ చేసి పురుగు మందుల నమూనాలను సేకరించడం జరుగుతుందన్నారు. ఎక్స్పైరీ తేదీ, నెలల ముందుగానే సంబంధిత డీలరుకు తెలియజేసి సదరు కంపెనీకి తిరిగి పంపించవలసినదిగా చెప్పడం జరుగుతోందన్నారు.




