Guntur: వలస బిడ్డలకు చదువుల భరోసా: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: గుంటూరు పశ్చిమ పరిధిలోని దుర్గా నగర్‌లో వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టల్‌ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం ప్రారంభించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 10 Oct 2026 5:03 PM IST
Guntur
X

Guntur: వలస బిడ్డలకు చదువుల భరోసా: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: ప్రతి చిన్నారికి విద్యను అందించాలనే లక్ష్యంతో వలస కార్మికుల పిల్లల సంరక్షణకు సీజనల్ హాస్టళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్‌ దుర్గా నగర్ లో సీజనల్ హాస్టల్‌ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. స్థానికంగా నివసిస్తున్న వలస కార్మికులు తమ పిల్లలను ఈ హాస్టల్‌లో చేర్పించి, విద్యను అందించాలని సూచించారు. హాస్టల్‌కు వచ్చే విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... వలస కార్మికుల కోసం భారత ప్రభుత్వం సీజనల్ హాస్టళ్లను నిర్వహిస్తోందని, వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉపాధి కోసం ఆయా ప్రాంతాలకు వలస వెళ్లడం అనేది చాలా కాలంగా కొనసాగుతున్న పరిస్థితి అని పేర్కొన్నారు. ముఖ్యంగా సీజన్‌ను బట్టి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, అక్కడే శాశ్వతంగా నివసించే పరిస్థితి లేకపోవడంతో వారి పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా సీజనల్ హాస్టళ్లు దోహదపడతాయని వివరించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మిర్చి యార్డు ఉండటంతో ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు పనుల కోసం వస్తుంటారని, ఈ నేపథ్యంలో వారి పిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించేందుకు సీజనల్ హాస్టళ్లు ఎంతో అవసరమన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సీజనల్ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వలస కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మన ప్రాంతానికి ఉపాధి కోసం ఎక్కడి నుంచో వచ్చిన వలస కార్మికుల పిల్లలు కూడా మన బాధ్యతేనని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. ప్రతి చిన్నారికి చదువుకునే అవకాశం కల్పించి, వారి భవిష్యత్తుకు బాటలు వేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN