Guntur: సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్: గళ్ళా మాధవి!

Guntur: సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి తీవ్రంగా ప్రశ్నించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 23 Oct 2026 11:10 PM IST
Guntur
X

Guntur: సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్: గళ్ళా మాధవి!

గుంటూరు: ప్రజాస్వామ్యం అంటే గొప్ప ప్రసంగాలు చేయడం, ప్రెస్‌మీట్లు పెట్టడం కాదని.. ప్రతికూల పరిస్థితుల్లో సంయమనం, పరిణతితో వ్యవహరించడమే నిజమైన నాయకత్వ లక్షణమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి అన్నారు. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వైఖరితో పాటు మహిళల గౌరవం, కుటుంబ సంబంధాల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్లకు అదనపు గడువు లభించిన నేపథ్యంలో జగన్‌ ప్రజాస్వామ్యం గెలిచిందంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. నామినేషన్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర బలగాలు, స్ట్రాంగ్‌రూమ్‌లు, అభ్యర్థులకు భద్రత కావాలని కోరడం ఒకవైపు.. మరోవైపు ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రకటించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్క పార్టీకి మాత్రమే పరిమితం కావని, నామినేషన్‌ వేయలేకపోయిన అర్హులైన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సహా అందరికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను తమ పార్టీకి అనుకూలంగా అర్థం చేసుకుంటూ, తమ ఆరోపణలే నిజమని ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.

మహిళల గౌరవంపై జగన్‌ మాటలకు, చేతలకు పొంతన లేదు

మహిళల హక్కులు, ఆత్మగౌరవం గురించి పదేపదే మాట్లాడే జగన్‌.. తన సొంత చెల్లెలు షర్మిల, మేనకోడలి విషయంలో వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని గళ్ళా మాధవి అన్నారు. కుటుంబంలో విభేదాలు ఉన్నప్పటికీ శుభకార్యాల సమయంలో శత్రువులైనా సరే ఆహ్వానాన్ని గౌరవించడం, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వారిని ఆశీర్వదించడం మన తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. మేనకోడలి వివాహానికి సంబంధించి షర్మిల ఆహ్వాన పత్రికలు అందిస్తూ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్న సందర్భంలో, వివాహ వేదిక విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్న వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు.

కుటుంబ విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం తమ ఉద్దేశం కాదని, అయితే మహిళల ఆత్మగౌరవం గురించి ప్రజలకు హామీలిచ్చే నాయకుడి వ్యక్తిగత ప్రవర్తన కూడా ఆయన చెప్పే మాటలకు అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జగన్‌ రాజకీయ ప్రస్థానంలో కీలకంగా పనిచేసిన షర్మిల, ఆయనకు అండగా నిలిచిన తల్లి విజయమ్మ చేసిన సేవలు, త్యాగాలను విస్మరించడం తగదన్నారు. రాజకీయ అవసరాల కోసం అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములంటూ ఆప్యాయంగా మాట్లాడి, అవసరం తీరిన తర్వాత వారినే దూరం పెట్టడం ఏ విధమైన నాయకత్వమని ప్రశ్నించారు.

మేనమామలా ఆశీర్వదించాల్సింది పోయి.. కంసమామలా వ్యవహరించడం ఏమిటి?

ఒక యువతి జీవితంలో వివాహం అత్యంత కీలకమైన ఘట్టమని, అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలవాల్సింది పోయి అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు రావడం విచారకరమని గళ్ళా మాధవి అన్నారు. మేనకోడలిని ఆశీర్వదించాల్సిన మేనమామలా కాకుండా, కంసమామలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఆస్తులు, రాజకీయ పదవులే ముఖ్యమా? కుటుంబ బంధాలు, ఆప్యాయతలకు విలువ లేదా? అని ప్రశ్నించారు.

గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబంలోనే తల్లి, చెల్లి గౌరవప్రదమైన పరిస్థితుల్లో లేరనే విమర్శలు వస్తున్నప్పుడు, రాష్ట్రంలోని మహిళల హక్కులు, భద్రత, ఆత్మగౌరవం గురించి ఆయన ఏ విధంగా మాట్లాడగలరని ప్రశ్నించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలనే దిశగా ఎన్టీఆర్‌ తీసుకొచ్చిన సంస్కరణలను గుర్తుచేస్తూ, మహిళల గౌరవానికి పెద్దపీట వేసిన రాష్ట్రంలో మహిళల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే నాయకత్వం అవసరమన్నారు.

పేర్ని నాని వ్యాఖ్యలు కూడా విడ్డూరమే

జగన్‌ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గళ్ళా మాధవి విమర్శలు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను అపరిచితులుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలను కలిసేందుకు కూడా పరదాల వెనుక ఉండే నాయకత్వం, ప్రజలకు దూరంగా ఉండే విధానం జగన్‌ రాజకీయ శైలిని ప్రతిబింబిస్తోందని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరును సమర్థించడానికి బదులుగా, తప్పు ఉంటే ప్రశ్నించాలని వైసీపీ నేతలకు సూచించారు.

కుటుంబాలను కలిపే కూటమి.. కుటుంబాలను విడదీసే వైసీపీ

కూటమి ప్రభుత్వం భిన్న వర్గాలు, నాయకులు, కుటుంబాలను కలుపుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగుతుంటే, వైసీపీ మాత్రం విభజించు.. పాలించు అనే ధోరణితో వ్యవహరిస్తోందని గళ్ళా మాధవి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కూటమి ఐకమత్యంతో ముందుకు సాగుతోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై నిరంతరం బురదజల్లడం, ప్రజలను వర్గాలుగా విడదీయడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదని పేర్కొన్నారు.

జగన్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను, కుటుంబ సభ్యులను సైతం వేర్వేరుగా చూడటం ఆయనలోని ఆధిపత్య ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలను ప్రేమిస్తున్నట్లు, మహిళలకు న్యాయం చేస్తానంటూ చెప్పే మాటలు ఓట్ల కోసమేనా అనే సందేహం కలుగుతోందన్నారు.

మహిళా నేతల మౌనం కూడా బాధాకరం

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలను ఆ పార్టీకి చెందిన మహిళా నాయకులు సమర్థించడం బాధాకరమని గళ్ళా మాధవి అన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు ఎవరు చేసినా ప్రశ్నించాల్సిన బాధ్యత మహిళా నాయకులపై ఉందన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు.

“యథా రాజా.. తథా ప్రజా” అన్నట్లుగా నాయకుడి ప్రవర్తనే ఆయన అనుచరులకు ఆదర్శంగా నిలుస్తుందని, కుటుంబ సభ్యులను గౌరవించని నాయకత్వం మహిళల పట్ల నిజమైన గౌరవాన్ని ఎలా పెంపొందిస్తుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో కక్షలు, కార్పణ్యాలు కాకుండా సంయమనం, సమన్వయం, పరిపక్వత అవసరమని స్పష్టం చేశారు.

రాజకీయ పదవులు, అధికారం శాశ్వతం కాదని.. వ్యక్తిత్వం, కుటుంబ బంధాల పట్ల గౌరవం, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే నిబద్ధతే నాయకుడి విలువను నిర్ణయిస్తాయని గళ్ళా మాధవి అన్నారు. ప్రజాస్వామ్యం, నైతికత, మహిళల హక్కుల గురించి మాట్లాడే ముందు జగన్‌ తన మాటలకు అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు. మహిళల గౌరవాన్ని కాపాడలేని, కుటుంబాలను కలిపి ఉంచలేని నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు అంగీకరించరని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN