Guntur: జగన్ బెంగళూరులోనే ఓటర్ ఐడీ తెచ్చుకోవాలి: గళ్ళా మాధవి!
Guntur: పులివెందులలో 40 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతుంటే ఓర్వలేక వైఎస్ జగన్ డ్రామాలాడుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Guntur: జగన్ బెంగళూరులోనే ఓటర్ ఐడీ తెచ్చుకోవాలి: గళ్ళా మాధవి!
గుంటూరు: 40 ఏళ్లలో మొదటిసారి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు.. తట్టుకోలేకనే వైకాపా డ్రామాలు. కర్తవ్యం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ మీడియాపై దాడులు చేయడం హేయమైన చర్య. స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు 40 శాతం వరకు సీట్లు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అంబులెన్స్‌లో వచ్చి ఓటేస్తే.. మాజీ సీఎం అయ్యుండి ఓటు వేయననడం అహంకారానికి పరాకాష్ట. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, అత్యంత పారదర్శకమైన వాతావరణంలో జరుగుతుంటే ఓర్చుకోలేక వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వింత చేష్టలకు పాల్పడుతున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి ధ్వజమెత్తారు. ఆదివారం టిడిపి జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చేతగానివారికి చేష్టలు ఎక్కువ అన్న రీతిలో జగన్ వ్యవహారశైలి ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు, రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. యంత్రాంగం సమన్వయంతో ఎన్నికలు శాంతియుతంగా జరుగుతుండటం చాలా అభినందనీయం.
పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్య ప్రక్రియ
గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పులివెందులలో ఈరోజు అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతమైన ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. పులివెందులను తమ కుటుంబ కంచుకోటగా భావించే జగన్మోహన్ రెడ్డి దీనిని సహించలేకపోతున్నారు. అక్కడ సామాన్య ప్రజలు భయం వీడి, స్వేచ్ఛాయుత వాతావరణంలో బారులుతీరి స్వచ్ఛందంగా ఓట్లు వేస్తుంటే ఆయనకు జీర్ణం కావడం లేదు.
మీడియాపై దాడులు గర్హనీయం
పులివెందులలో జరుగుతున్న వాస్తవాలను, శాంతియుత పోలింగ్‌ను నిష్పక్షపాతంగా ప్రసారం చేస్తున్న జాతీయ మీడియాతో సహా జర్నలిస్టులపై వైకాపా శ్రేణులు హేయమైన దాడులకు తెగబడటం సిగ్గుచేటు. పోలింగ్ ఏజెంట్లను రానివ్వడం లేదని అబద్ధపు ప్రచారాలు చేస్తూ, వాస్తవాలు చూపిస్తున్న మీడియా గొంతు నొక్కాలని చూడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
బీసీలు, మహిళలకు 40% ప్రాతినిధ్యం
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి స్థానిక సంస్థల్లో బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేసింది. దాదాపు 39 నుంచి 40 శాతం వరకు సీట్లను బీసీలకు, మహిళలకే కేటాయించింది. అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కడాన్ని చూసి ఓర్వలేకనే జగన్ అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రీపోలింగ్ డ్రామాలు – కుట్రపూరిత రాజకీయం
ఎన్నికల ప్రక్రియను వివాదాస్పదం చేసి, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి, తద్వారా రీపోలింగ్ కోరాలనేది జగన్ కుట్ర. 2021లో నామినేషన్లు కూడా వేయనీయకుండా 'అన్నీ ఏకగ్రీవం కావాలి' అని బెదిరించిన వ్యక్తే.. ఈరోజు ఎక్కడా ఏకగ్రీవం కాకూడదని మాట్లాడటం ద్వంద్వ నీతికి నిదర్శనం. అధికారం ఉంటే ఒకలా, అధికారం పోతే రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేయడం ఆయన నైజం.
ఓటు వేయననడం అహంకారం, కుప్పంలో ఓ సాధారణ పౌరుడు
అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, బాధ్యతగా అంబులెన్స్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువను కాపాడారు. కానీ ఒక మాజీ సీఎంగా పనిచేసి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం 'రీపోలింగ్ పెడితేనే ఓటు వేస్తా' అని రోడ్డుపై కూర్చోవడం రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆయనకున్న అహంకారాన్ని, బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం, రీపోలింగ్ అంటేనే ఓటేస్తాననడం ఆయన మానసిక పరిపక్వత లోపానికి నిదర్శనం.
ఏజెంట్లను ఎవరూ బయటకు నెట్టలేదు
వైకాపా ఏజెంట్లను ఎవరూ భయభ్రాంతులకు గురిచేయలేదని, వాళ్లంతట వాళ్లే బయటకు వచ్చారని స్థానిక జిల్లా కలెక్టర్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. నిరాధార ఆరోపణలతో సానుభూతి పొందాలని చూడటం హాస్యాస్పదం. మొన్నటికి మొన్న 'చొక్కా మడత పెడతా' అన్న జగన్ ని.. 2024 ఎన్నికల్లోనే ప్రజలు శాశ్వతంగా చొక్కా మడతపెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు.
బెంగళూరులోనే ఓటర్ ఐడీ తీసుకోండి
పులివెందులకు తాగునీరు అందించింది, రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దుతోంది కూటమి ప్రభుత్వమే. ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని గ్రహించే జగన్ గారు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రజాతీర్పును గౌరవించడం చేతగాకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టకుండా బెంగళూరు ప్యాలెస్‌లోనే ఓటర్ ఐడీ సృష్టించుకుని అక్కడే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే ఫలితాల్లో వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.




