Guntur: కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్‌లో పతకాలు.. క్రీడాకారులకు రూ.2 లక్షల సాయం!
Guntur: కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను గుంటూరులో జన చైతన్య గ్రూప్ అధినేత మాదల చైతన్య సత్కరించి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.
Guntur: కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్‌లో పతకాలు.. క్రీడాకారులకు రూ.2 లక్షల సాయం!
గుంటూరు: కామన్వెల్త్ క్లాసిక్ అండ్ ఈక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ – 2026లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి చక్కటిప్రతిభ కనపరచి బహుమతులు సాధించిన యువ క్రీడాకారులు మధిర షానన్, బొల్లు లిఖిత, సంకా కౌశిక్, మరియు కోచ్ ఘట్టమనేని సాయి రేవతిలను జన చైతన్య గ్రూపు అధినేత మాదల చైతన్య అభినందించారు.
మంగళవారం చంద్రమౌళి నగర్ లోని ఆయన కార్యాలయంలో బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. 47 కిలోల జూనియర్ విభాగంలో మధిర షానన్ వెండి పతకం, 76 కిలోల సబ్ జూనియర్ విభాగంలో బొల్లు లిఖిత బంగారు పథకం, 95 కిలోల విభాగంలో సంకా కౌశిక్ వెండి పతకం సాధించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మాదల చైతన్యమాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు, బహుమతులు సాధించడం గర్వకారణమన్నారు.
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించవచ్చన్నారు. క్రీడాకారులకు అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం, తన వంతు సహకారం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహిస్తే మన రాష్ట్రం నుంచి మరింత మంది ప్రతిభావంతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు గెలిచే అవకాశం ఉందన్నారు. యువతను కేవలం అభినందించడం మాత్రమే కాకుండా,వారి ప్రతిభను గుర్తించి అవసరమైన సమయంలో ఆచరణాత్మకంగా అండగా నిలవడం ద్వారా సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
“పతకాలు సాధించడం ఒక్క విజయం కాదు.. దేశం కోసం పోరాడే స్ఫూర్తిని యువతలో నింపడమే అసలైన విజయం” అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన యువతకు అడ్డంకిగా మారకూడదన్న ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బహుమతులు సాధించిన క్రీడాకారులు మాట్లాడుతూ తమలాంటి యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్న మాదల చైతన్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పోటీకి వెళ్లే సమయంలో అందించిన రెండు లక్షల ఆర్థిక సహాయం తమకు ఎంతో ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకువస్తామని పేర్కొన్నారు. అనంతరం పవర్ లిఫ్టింగ్ కోచ్ ఘట్టమనేని సాయి రేవతి, బహుమతులు గెలుచుకున్న మధిర షానన్, బొల్లు లిఖిత, సంకా కౌశిక్ లను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో క్రీడాభిమానులు, వల్లంశెట్టి రమేష్, సి.హెచ్. విజయ్, పొన్నెకంటి శ్రీనివాసరావు, పాల్గొన్నారు.




