Guntur: ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి!

Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 11 Nov 2026 12:52 PM IST
Guntur
X

Guntur: ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి!

Guntur: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ జాతీయ నాయకుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అబుల్ కలాం ఆజాద్ గొప్ప భారత స్వాతంత్ర్య సమరయోధులు అన్నారు. భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, దేశ విద్యా వ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు.

ఆజాద్ అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషలతో పాటు ఇస్లామిక్ ధర్మశాస్త్రం, తత్వశాస్త్రం, గణితం వంటి అనేక అంశాలను అభ్యసించారని చెప్పారు.

స్వయంకృషితో ఇంగ్లీషు భాషతో పాటు ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారని తెలిపారు. దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఆజాద్ తన రచనలు, ప్రసంగాలను ఉపయోగించారని చెప్పారు. 1912లో 'అల్ హిలాల్' అనే ఉర్దూ పత్రికను ప్రారంభించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించిన వ్యక్తి అన్నారు.

హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉండాలని, మతాలకు అతీతంగా భారతీయులందరూ స్వాతంత్ర్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారని తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని ఆయన ఆకాంక్షించారని అన్నారు. పేదలు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విద్య అందించాలని కృషి చేశారని పేర్కొన్నారు.

14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఆకాక్షించారని అన్నారు. సాంకేతిక, శాస్త్రీయ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏర్పాటుకు పునాది వేశారన్నారు.

భారతీయ సాంస్కృతిక, సాహిత్య, కళారంగాల అభివృద్ధికి సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీల ఏర్పాటుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా సమాజ అభివృద్ధికి, జాతీయ పురోగతికి ప్రధాన సాధనంగా భావించారని తెలిపారు.

ఇండియా విన్స్ ఫ్రీడమ్ వంటి రచనలు చేశారని తెలిపారు. దేశానికి, ముఖ్యంగా విద్యారంగానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1992లో మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించిందన్నారు. 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం అజాద్ జన్మ దినం రోజును జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం దేశభక్తికి, విద్యపట్ల అంకితభావానికి, మతసామరస్యానికి, జాతీయ సమైక్యతకు ఒక గొప్ప నిదర్శనం అన్నారు. విద్య ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని విశ్వసించిన ఆయన ఆశయాలు నేటికీ భారతీయ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె.పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN