Bapatla: చీరాల అత్యాచార కేసు.. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష!
Bapatla: చీరాల అత్యాచార, హత్య కేసులో సంచలన తీర్పు. ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం.
Bapatla: చీరాల అత్యాచార కేసు.. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష!
బాపట్ల జిల్లా: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని, "ఆపరేషన్ దండాయన్"లో భాగంగా మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. 2024 జూన్ 21న బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 సంవత్సరాల వయస్సు గల యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20,000/- చొప్పున ఇద్దరికి రూ.40,000/- నగదు జరిమానా, మూడవ ముద్దాయికి 5 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ ఒంగోలు రెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి పి. లలిత గారు 22.06.2026 సోమవారం తీర్పు వెలువరించి, విక్టిమ్ కాంపెన్సేషన్ గా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కేసు వివరాలు:
2024 జూన్ 21వ తేదీ ఉదయం 5:45 గంటల సమయంలో బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం గ్రామానికి చెందిన 21 సంవత్సరాల వయస్సు గల యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో, అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్ (26), కారంకి మహేష్ బాబు @ మహేష్ (23) ఇద్దరూ కలిసి ఆమెను ఈపురుపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల గోడ వెనుక, రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను దొంగిలించి వెళ్లిపోయారు. అనంతరం ఆ ఇద్దరు నిందితులు మూడో ముద్దాయి దేవరకొండ శ్రీకాంత్ (24) వద్దకు వెళ్లగా, అతడు వారికి ఆశ్రయం కల్పించి దాచిపెట్టాడు.
హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.169/2024గా సెక్షన్లు 302, 376(D), 379, 212 r/w 34 IPC కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అధికారి, అప్పటి చీరాల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎన్. సత్యనారాయణ గారు నేరస్థలాన్ని పరిశీలించి, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం సహాయంతో భౌతిక సాక్ష్యాధారాలను సేకరించారు. విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారించి, ముగ్గురు నిందితులు నేరానికి పాల్పడినట్లు తగిన సాక్ష్యాధారాలు సేకరించి, 22.06.2024న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, నిపుణుల నివేదికలను జతపరచి, 19.09.2024న సంబంధిత న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఒంగోలు రెండవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు విచారణకు రాగా, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ ఎం.డి.మోయిన్ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ, ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుల్ షేక్ కరిముల్లా సాక్షులను సరైన సమయంలో కోర్టుకు హాజరుపరిచి, నిర్భయంగా సాక్ష్యం చెప్పేలా చర్యలు చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నల్లూరి అవనీష్ గారు కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించి, ముగ్గురు నిందితులపై మోపబడిన నేరాలను తగిన సాక్ష్యాధారాలతో నిరూపించారు.
వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి శ్రీమతి పి. లలిత మొదటి ముద్దాయి దేవరకొండ విజయ్ (26), రెండవ ముద్దాయి కారంకి మహేష్ బాబు @ మహేష్ (24)లకు IPC సెక్షన్ 376(D) కింద యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.10,000/- జరిమానా, IPC సెక్షన్ 302 కింద మరో యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.10,000/- జరిమానా విధించారు. ఇరువురి ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 40,000/- నగదు జరిమానా, మూడవ ముద్దాయి దేవరకొండ శ్రీకాంత్ (24)కు IPC సెక్షన్ 212 కింద 5 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. అదేవిధంగా విక్టిమ్ కాంపెన్సేషన్ గా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచార హత్య కేసులో నిందితులకు విధించిన ఈ శిక్షలు అందుకు నిదర్శనమన్నారు. వేగవంతమైన దర్యాప్తు, నిర్దేశిత గడువులోపు చార్జ్‌షీట్లు దాఖలు చేయడం, కోర్టు విచారణలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సాక్షులను నిర్భయంగా సాక్ష్యం చెప్పేలా చేయడం వల్ల నిందితులకు శిక్షలు పడుతున్నాయని తెలిపారు.
మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి కోర్టు ట్రయల్ మానిటరింగ్ నిర్వహిస్తున్నామని, అందువల్ల బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు ఉంచగలుగుతున్నామన్నారు. మహిళలు, మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రారంభించిన "ఆపరేషన్ దండాయన్" కార్యక్రమం ద్వారా మహిళలకు సంబంధించిన కేసులను వేగవంతంగా దర్యాప్తు చేసి, 60 రోజులలోపు చార్జ్‌షీట్లు దాఖలు చేసి, కేసు తీవ్రతను బట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ పూర్తి చేసి నిందితులకు త్వరతగతిన కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కేసులో వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి, నిందితులను అరెస్టు చేసి, భౌతిక సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించి, వేగవంతమైన ట్రయల్ జరిగేలా పర్యవేక్షించి ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, వారికి ఆశ్రయం కల్పించిన మూడవ నిందితుడికి 5 సంవత్సరాల కారాగార శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.




