Macherla: మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి మాదిగలకే కేటాయించాలి
Macherla: మాచర్ల మున్సిపాలిటీలో 40 ఏళ్లుగా మాదిగలకు చైర్మన్ పదవి దక్కలేదని, ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఎమ్మార్పీఎస్ హెచ్చరించింది.
Macherla: మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి మాదిగలకే కేటాయించాలి
Macherla: మాచర్ల మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి సుమారు 40 ఏళ్లుగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కకపోవడం బాధాకరమని మాదిగల రాజకీయ చైతన్య వేదిక ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో శనివారం మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ పార్కులో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాదిగ రాజకీయ మేధావులు మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీలు వివిధ సామాజిక వర్గాలకు చైర్మన్ పదవికి అవకాశాలు కల్పించినట్లే, మాదిగ సామాజిక వర్గానికి కూడా చైర్మన్ పదవి కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు.
ఎన్నికల సమయంలో ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకోవడం కాకుండా, మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం కల్పించాలని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా మాదిగలకు చైర్మన్ పదవి ఇచ్చేవిధంగా రాజకీయ పార్టీలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
మాదిగలకు అవకాశం కల్పించని పక్షంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడంతో పాటు, అవసరమైతే మాదిగల రాజకీయ చైతన్య వేదిక బలపరచిన స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరించారు. సామాజిక న్యాయం, సమాన రాజకీయ అవకాశాల దిశగా అన్ని పార్టీల నాయకులు సానుకూలంగా స్పందించాలని మాదిగ రాజకీయ చైతన్య వేదిక ప్రతినిధులు కోరారు. మాదిగలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు.
తప్ప ఉన్నత రాజకీయ పదవులు కల్పించడం లేదన్నారు. మాచర్లలో మాదిగలకు ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని డబ్బులు, మద్యం వంటి ప్రలోభాలతో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అయితే రాజకీయ పదవులు ఉన్నత స్థానాలు కల్పించే విషయంలో మాత్రం తమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్లలో మాదిగ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని చైర్మన్ పదవిని శాసించే ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.




