Guntur: మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా గ్రీవెన్స్: గళ్ళా మాధవి!

Guntur: గుంటూరు పశ్చిమ కార్యాలయంలో గురువారం నూతన మహిళా కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే గళ్ళా మాధవి మహిళా గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Nov 2026 6:52 PM IST
Guntur
X

Guntur: మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా గ్రీవెన్స్: గళ్ళా మాధవి!

Guntur: మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి గురువారం అందుబాటులో ఉంటూ, మహిళా గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం (శ్రీనివాసరావుపేట)లో గురువారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఎన్డీయే కూటమికి చెందిన నూతన మహిళా కార్పొరేటర్లతో కలిసి మహిళా గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వారి నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రతి గురువారం నియోజకవర్గ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా, నిర్భయంగా వచ్చి చెప్పుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోందన్నారు. అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

ఇటీవల ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన నూతన మహిళా కార్పొరేటర్ల సమక్షంలో ఈసారి గ్రీవెన్స్‌ నిర్వహించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. మహిళా కార్పొరేటర్లు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

మౌలిక వసతుల సమస్యలు, అప్పులు ఇచ్చి మోసపోవడం, దొంగతనాలు, ఉద్యోగ అవకాశాలు, కుటుంబాల్లో వేధింపులు వంటి అనేక సమస్యలతో మహిళలు తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. ఇతరులతో చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలను సైతం మహిళలు ఇక్కడ ధైర్యంగా వెల్లడిస్తున్నారని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు సమస్యల రహితంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ తమ కుటుంబాలతో ఆనందంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, స్ఫూర్తితో మహిళా సంక్షేమం, సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రతి గురువారం మహిళా గ్రీవెన్స్‌ కోసం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం అందుబాటులో ఉంటుందని, మహిళలు తమకు ఎదురయ్యే చిన్న సమస్యనైనా నిర్భయంగా వచ్చి తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు అండగా నిలిచిన నూతన మహిళా కార్పొరేటర్లు, కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN