Mangalagiri: మంగళగిరిలో యాంకర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన నిందితుడి అరెస్ట్!

Mangalagiri: రీల్స్ ప్రమోషన్ పేరుతో యాంకర్‌కు మత్తుమందు ఇచ్చి అశ్లీల ఫొటోలు తీసి డబ్బులు వసూలు చేసిన నిందితుడు షేక్ జానీ అలియాస్ సిద్దీక్‌ను మంగళగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 8 Oct 2026 11:00 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరిలో యాంకర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన నిందితుడి అరెస్ట్!

మంగళగిరి: మహిళను మాయమాటలతో నమ్మించి లాడ్జికి రప్పించుకోవడంతో పాటు, ఆమెకు తెలియకుండా అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని మంగళగిరి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం పట్టణ సీఐ వీరాస్వామి తెలిపిన వివరాల ప్రకారం... కడప కు చెందిన ఓ 28 ఏళ్ల మహిళ సింగర్‌, యాంకర్‌గా కార్యక్రమాలకు హాజరవుతుంటుంది.

ఈ క్రమంలో మంగళగిరి నగరం లోని టిప్పర్ల బజారుకు చెందిన షేక్ జాని @ సిద్దీక్ ఆమెకు ఫోన్ చేసి తనకు పేట్ (పెంపుడు) జంతువులు) షాప్ ఉందని, ప్రమోషన్ కొరకు రీల్స్ చేసేందుకు విజయవాడకు రావాలని అందుకు రూ.30 వేలు చెల్లిస్తానని చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 20న సదరు మహిళ నిందితుడిని ఫోన్ లో సంప్రదించగా మంగళగిరిలోని సాయి ప్రియ రెసిడెన్సీ గదికి రావాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు.

ఆమె అక్కడికి వెళ్లిన అనంతరం నిందితుడు సిద్దీక్ ఆమెకు మత్తు కలిగించే పదార్థం కలిపిన నీటిని ఇచ్చినట్లు తెలిపారు.ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో నిందితుడు ఆమెకు తెలియకుండా అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసి అనంతరం వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి, ఆమెను మానసికంగా వేధించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న రూ.15,800లను ఫోన్‌పే ద్వారా బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం ఆమెను గదిలోనే ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయినట్లు తెలిపారు.బాధితురాలు బయటకు వచ్చిన అనంతరం మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించి Cr.No.270/2026, U/S 64(1), 308(2), 351(2) BNS కింద మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అక్టోబర్‌ 8న ఉదయం మంగళగిరి టౌన్‌లోని గౌతమబుద్ధ రోడ్డు, పాత బస్టాండ్ సమీపంలో నిందితుడు ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పట్టణం సీఐ వీరాస్వామి తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో, గుంటూరు నార్త్ డీఎస్పీ సారథ్యంలో, మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వీరాస్వామి ఆధ్వర్యంలో ఎస్ ఐ రవీంద్ర నాయక్, పోలీసు సిబ్బంది దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI