Mangalagiri: టీడీపీ శిక్షణ సదస్సులో మాట్లాడిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

Mangalagiri: కార్యకర్తలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే టీడీపీ లక్ష్యమని మంగళగిరిలో జరిగిన శిక్షణ సదస్సులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 7 Sept 2026 10:27 PM IST
Mangalagiri
X

Mangalagiri: టీడీపీ శిక్షణ సదస్సులో మాట్లాడిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

మంగళగిరి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్త వెన్నంటే నిలవడమే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. కార్యకర్తలకు కేవలం గౌరవం కల్పించడం కాకుండా.. వారిని రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యకర్త కుటుంబానికి బీమా, విద్య, వైద్యం, ఉపాధి వంటి భరోసా కల్పిస్తూ.. వారి ఆర్థిక ప్రగతికి మార్గం చూపుతున్నారని తెలిపారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ లీడర్‌షిప్ శిక్షణ సదస్సులో ‘రాజకీయ, ఆర్థిక సాధికారత’ అంశంపై ఏలూరి ప్రసంగించారు.

కార్యకర్తే పార్టీకి వెన్నెముక

అధికారంతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండే లక్షలాది మంది కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని ఏలూరి అన్నారు. కోటి మందికి పైగా క్రియాశీల సభ్యులతో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి అగ్ర నాయకత్వం వరకు ఇప్పటికే దాదాపు 10 వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలకు సమర్థవంతమైన శిక్షణ అందించామని తెలిపారు. భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు.

సిఫార్సులకు స్వస్తి.. ప్రతిభకే పెద్దపీట

కార్యకర్తలకు పదవులు, అవకాశాలు కల్పించడంలో సిఫార్సులకు తావులేకుండా ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. నామినేటెడ్ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమర్థత, సేవా తత్వం ఆధారంగా కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజకీయంగా ఎదగడంతోపాటు కార్యకర్త ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నప్పుడే పార్టీ పునాదులు మరింత బలపడతాయని పేర్కొన్నారు.

కుటుంబానికి బీమా.. పిల్లలకు విద్య

మంత్రి నారా లోకేష్ ఆలోచనతో కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అమలు చేస్తున్నామని ఏలూరి తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘న్యూట్రిఫుల్’ యాప్, హెల్త్ రికార్డుల ద్వారా కార్యకర్తల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు.

టీడీపీ సభ్యత్వ కార్డు కేవలం గుర్తింపు కార్డు కాదు.. కార్యకర్త కుటుంబానికి పార్టీ అందించే బీమా, విద్య, వైద్యం, ఉపాధి భరోసాకు ప్రతీక అని ఏలూరి అభివర్ణించారు.

రూ.75 లక్షల ఆదాయమే లక్ష్యం

2040 నాటికి రాష్ట్రంలో సాధారణ తలసరి ఆదాయం రూ.50 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. టీడీపీ కుటుంబాల ఆదాయం నీతివంతమైన మార్గాల్లో రూ.75 లక్షలు దాటాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని ఎమ్మెల్యే ఏలూరి వెల్లడించారు. కార్యకర్త కుటుంబాలు ఆర్థికంగా బలపడేలా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై పార్టీ దృష్టి సారిస్తోందన్నారు.

సాధారణ కార్యకర్త నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా..

తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే ఏలూరి భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ నేపథ్యం లేని సాధారణ విద్యార్థి నాయకుడిగా ఉన్న తనకు పర్చూరు ఎమ్మెల్యేగా మూడుసార్లు అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడిదే అని గుర్తుచేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తలో నాయకత్వ లక్షణాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడమే టీడీపీ విధానమని అన్నారు.

ఓటమి.. గెలుపు కార్యకర్తల ఆత్మగౌరవం

ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపోటములు వ్యక్తిగత అంశాలు కాదని ఏలూరి స్పష్టం చేశారు. అవి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఆత్మగౌరవానికి సంబంధించినవని పేర్కొన్నారు. అందుకే ప్రతి కార్యకర్త పార్టీని సొంత బాధ్యతగా భావించి ప్రజల్లో నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు.

నెక్స్ట్ జనరేషన్ నాయకత్వమే లక్ష్యం

నారా లోకేష్ నేతృత్వంలో ‘కార్యకర్తే అధినేత’ అనే సిద్ధాంతంతో నెక్స్ట్ జనరేషన్ నాయకత్వాన్ని తయారు చేస్తున్నామని ఏలూరి తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ నాయకత్వ అవకాశాలు కల్పిస్తూ.. భవిష్యత్ తరాలకు బలమైన రాజకీయ పునాది నిర్మిస్తున్నామని చెప్పారు.

‘నా దేశం–నా బాధ్యత’ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ‘నా తెలుగుదేశం–నా బాధ్యత’ అనే నినాదంతో ముందుకు సాగాలి అని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు. కార్యకర్త సంక్షేమం, కుటుంబ ఆర్థిక ప్రగతి, రాజకీయ సాధికారతకు పెద్దపీట వేస్తూ టీడీపీని మరింత బలమైన ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story