Mangalagiri: డ్రగ్స్ సమాచారానికి 1972కు కాల్ చేయండి: మంగళగిరి సీఐ!

Mangalagiri: మంగళగిరి రూరల్ పరిధిలోని నీరుకొండ పరిసరాల్లో ఈగల్ టీంతో కలిసి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 5 Sept 2026 10:45 PM IST
Mangalagiri
X

Mangalagiri: డ్రగ్స్ సమాచారానికి 1972కు కాల్ చేయండి: మంగళగిరి సీఐ!

మంగళగిరి: గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు మంగళగిరి రూరల్‌ పోలీసులు చర్యలు చేపట్టినట్లు మంగళగిరి గ్రామీణ సిఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళగిరి రూరల్‌ పోలీసులతో పాటు ఈగల్‌ టీం సిబ్బంది శనివారం నీరుకొండ గ్రామ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

నీరుకొండ గ్రామం వెలుపల ఉన్న కొండ ప్రాంతంతో పాటు నిర్మానుష్య ప్రదేశాలు, అనుమానాస్పద ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి సాగు, నిల్వ, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలపై నిఘా ఉంచడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.

మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నీరుకొండ, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ప్రజలు, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా లేదా గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు లేదా ఈగల్‌ బృందానికి సమాచారం అందించాలని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ఈగల్‌ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ 1972కు తెలియజేయాలని ఆయన కోరారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

Next Story