Mangalagiri: తక్కువ ధరకే స్థలాలంటూ భారీ మోసం.. తండ్రీకొడుకుల అరెస్ట్!
Mangalagiri: మంగళగిరి పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకే స్థలాలంటూ నకిలీ పత్రాలతో రూ.75 లక్షల భారీ మోసానికి పాల్పడిన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Mangalagiri: తక్కువ ధరకే స్థలాలంటూ భారీ మోసం.. తండ్రీకొడుకుల అరెస్ట్!
Mangalagiri: తక్కువ ధరకే స్థలాలు ఇప్పిస్తామని నమ్మించి, నకిలీ పత్రాలతో అమాయక ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన తండ్రీకొడుకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు... సీఐ వెంకట్ తెలిపిన వివరాల మేరకు.మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన శ్యామల నర్సారెడ్డి (60), అతని కుమారుడు శ్యామల గోపీచంద్ రెడ్డి (34) కలిసి మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని తక్కువ ధరకే స్థలాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.
నూతక్కి గ్రామానికి చెందిన అన్నపురెడ్డి సంజీవరెడ్డి వద్ద నుంచి రూ.20 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని, వేరొకరి సంతకాలతో నకిలీ విక్రయ ఒప్పంద పత్రాలను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, అతనిపై దాడికి పాల్పడి బెదిరించినట్లు తెలిపారు. అలాగే కాజ గ్రామానికి చెందిన ఈద నాగిరెడ్డి వద్ద నుంచి రూ.12.50 లక్షలు,
మంగళగిరి పట్టణానికి చెందిన పెద్దం శివరామకృష్ణ వద్ద నుంచి విడతల వారీగా రూ.41 లక్షలు వసూలు చేసి, స్థలాల రిజిస్ట్రేషన్ చేయకుండా మోసగించినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బులు తిరిగి అడిగిన బాధితులను దుర్భాషలాడడంతో పాటు చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు.ముగ్గురు బాధితుల నుంచి మొత్తం రూ.75 లక్షల మేర మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు,
బాధితుల ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్లు 519/2025, 518/2025, 404/2025 కింద కేసులు నమోదు చేశారు. సీఐ చిరుమామిళ్ల వెంకట్ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఈ నెల 14న నిందితులను అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు.




