Mangalagiri: ఉత్కంఠ పోరులో రాయలసీమపై అమరావతి ఘన విజయం

Mangalagiri: మంగళగిరి స్టేడియంలో జరిగిన WAPL మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించిన అమరావతి ఈ ఛాంపియన్స్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా దీక్ష.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 20 Sept 2026 7:52 PM IST
Mangalagiri
X

Mangalagiri: ఉత్కంఠ పోరులో రాయలసీమపై అమరావతి ఘన విజయం

మంగళగిరి: మంగళగిరి(ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం) మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL)లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. రాయలసీమ జెన్ స్టార్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అమరావతి జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచిన రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగుల భారీ స్కోరు సాధించింది.అమరావతి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రంగ లక్ష్మి మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచింది. గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన ఆమె, ఈ మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడింది.

44 బంతులు ఎదుర్కొన్న రంగ లక్ష్మి 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి జట్టు స్కోరును పటిష్టం చేసింది.మరో ఓపెనర్ అనూష కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడింది. 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరుకు తన వంతు సహకారం అందించింది.

వన్‌డౌన్‌గా వచ్చిన కాట్రగడ్డ దీక్ష మాత్రం బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించింది. కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి అమరావతి స్కోరును వేగంగా పెంచింది. ఆమె అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.రాయలసీమ జెన్ స్టార్స్ బౌలర్లలో పద్మజ, అనూష, పూజిత తలా ఒక వికెట్ పడగొట్టారు.

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాయలసీమ బ్యాటర్లలో గ్రీష్మ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి ఆకట్టుకోగా, శుభశ్రీ 15 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసింది.

అయితే మిగిలిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాయలసీమ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.అమరావతి బౌలర్లలో సాయి పూజిత అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టగా, కాండ్రేగుల దేవిక 2 వికెట్లు తీసింది. సాయి దీప్తి, జోషి చెరో వికెట్ సాధించారు.మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కాట్రగడ్డ దీక్షకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు డబ్ల్యూఏపీఎల్ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసి టోర్నీలో తన ప్రదర్శనను మరింత బలోపేతం చేసుకుంది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.