Mangalagiri: నో వెహికల్ డే తో నిమ్మల సైకిల్ యాత్రా.. జగన్‌పై విమర్శలు

Mangalagiri: మంత్రి రామానాయుడు 'నో వెహికల్ డే' సంచలనం. పాలకొల్లు నుండి రైల్లో ప్రయాణం తాడేపల్లి టు మంగళగిరి సైకిల్ యాత్ర. జగన్‌పై పిచ్చి తుగ్లక్ అంటూ విమర్శలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 22 May 2026 6:10 PM IST
Mangalagiri
X

Mangalagiri: నో వెహికల్ డే తో నిమ్మల సైకిల్ యాత్రా.. జగన్‌పై విమర్శలు

Mangalagiri: అమరావతి రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసిన అంశం మంత్రి నిమ్మల రామానాయుడు చేపట్టిన “నో వెహికల్ డే” కార్యక్రమం. వరుసగా రెండో వారం కూడా ప్రజా రవాణాను ఉపయోగిస్తూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయాణం కేవలం పర్యావరణ కార్యక్రమంగా మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రయాణం చివర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.

పాలకొల్లు నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి ట్రైన్‌లో విజయవాడ చేరుకోవడం ద్వారా నిమ్మల రామానాయుడు తన కార్యక్రమానికి ప్రారంభం పలికారు. సాధారణంగా మంత్రులు భారీ కాన్వాయ్‌లతో తిరుగుతుంటారు. కానీ అందుకు భిన్నంగా ప్రజలతో కలిసి రైల్లో ప్రయాణించడం ద్వారా తాను కూడా సాధారణ వ్యక్తినేననే సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ప్రయాణంలో పలువురు ప్రయాణికులు మంత్రిని గుర్తించి మాట్లాడటం, స్థానిక సమస్యలను ప్రస్తావించడం కనిపించింది. ఇలా ప్రజలతో నేరుగా మమేకం కావడం రాజకీయంగా కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోంది.

విజయవాడలోని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌ చేరుకున్న తర్వాత. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సుమారు 18 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై ప్రయాణించారు. ఈ ప్రయాణంలో మధ్యలో పలుచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. సాధారణంగా రాజకీయ నాయకుల రోడ్ షోలు భారీ హడావుడిగా ఉంటాయి. కానీ నిమ్మల మాత్రం అందుకు విరుద్ధంగా సాగి పోయారు.

తాడేపల్లి వద్ద ఈ యాత్రకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు స్వాగతం పలకడం, అనంతరం ఇద్దరూ ఒకే సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం సరదా దృశ్యం మాత్రమే కాకుండా పార్టీ ఐక్యతను చూపించే రాజకీయ సంకేతంగా కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.

అయితే అసలు రాజకీయం ఆ తర్వాతే ప్రారంభమైంది. మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్‌ను “పిచ్చి తుగ్లక్” అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అధికారంలోకి రావడం కోసం ఎంతకైనా తెగిస్తారని, హత్య రాజకీయాలు ఆయనకు అలవాటేనని ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, ఈ వ్యాఖ్యల తీవ్రత మాత్రం మరోసారి అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది.

ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో “హత్య రాజకీయాలు” అనే అంశం తీవ్ర చర్చకు వస్తోన్న నేపద్యం లో ఆధికార పక్షం ఒకలా, ప్రతిపక్షం మరోలా ఆరోపణలు చేసుకుంటున్నాయి. అదే నేపథ్యంలో నిమ్మల వ్యాఖ్యలు కూడా విశేషాన్ని సంతరించుకున్నాయి.

“మావిగన్ అంటే కూటమి కాదు, ప్రజలే భయపడుతున్నారనీ”ఇక అమరావతి అంశాన్ని కూడా నిమ్మల తన విమర్శలో ప్రధానంగా ప్రస్తావించారు. రాజధాని ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి జగన్‌కు భయం మొదలైందని, అందుకే అమరావతిపై విషం కక్కుతున్నారని ఆరోపించారు.

నిమ్మల రామానాయుడు చేపట్టిన “నో వెహికల్ డే” కార్యక్రమం మొదట పర్యావరణం, ఆరోగ్యం, ప్రజలతో అనుబంధం అనే అంశాలతో ప్రారంభమైనా, చివరకు అది పూర్తిస్థాయి రాజకీయ సందేశంగా మారింది. ఒకవైపు సైకిల్ యాత్రతో ప్రజలకు దగ్గరవుతూ, మరోవైపు జగన్‌పై ఘాటు విమర్శలు చేస్తూ అధికార పక్షం తన వైఖరిని స్పష్టంగా చెపుతోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story