Mangalagiri: జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర నిప్పులు

Mangalagiri: మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 13 Jun 2026 6:27 PM IST
Mangalagiri
X

Mangalagiri: జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర నిప్పులు

Mangalagiri: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గొడ్డలిపోటుకు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని,

సొంత కుటుంబ సభ్యుల విషయంలో కూడా న్యాయం చేయలేని నాయకుడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ, న్యాయం కోసం పోరాడుతున్న తన సొంత చెల్లి షర్మిలపైనే ఆరోపణలు చేయడం జగన్ రాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రజలు ఈ వ్యవహారాలన్నింటినీ గమనించారని, అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి గట్టి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.

జగన్ పాలనలో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని మంత్రి ఆరోపించారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హామీని పక్కనపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో సొంత బ్రాండ్ల మద్యం పేరుతో భారీ అవినీతి జరిగిందని, కల్తీ మద్యం కారణంగా వేలాది కుటుంబాలు నష్టపోయాయని అన్నారు.

మద్య నిషేధం అమలు కాకపోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని సైతం ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. విద్యుత్ రంగంలోనూ భారీ భారం ప్రజలపై మోపారని, ట్రూ-అప్ చార్జీలు, విద్యుత్ ధరల పెంపులతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యుత్ సంస్థలు కూడా భారీ నష్టాల్లోకి వెళ్లాయని మంత్రి పేర్కొన్నారు.

యువత, విద్యార్థుల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని కొల్లు రవీంద్ర విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారని, మెగా డీఎస్సీ హామీ కూడా అమలు కాలేదని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వేలాది మంది యువత నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చేశారని, యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని ఆరోపించారు. విద్యారంగంలో తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల విలీనంతో అనేక మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీఓను రద్దు చేసిందని గుర్తు చేశారు.

అమరావతి అంశంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీలో అమరావతే రాజధాని అని చెప్పి, తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఐదేళ్ల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

మహిళా రైతులపై జరిగిన పోలీసు చర్యలు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, సాగునీటి రంగం, పరిశ్రమల అభివృద్ధి వంటి కీలక అంశాల్లో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జగన్ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారని, అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని వ్యాఖ్యానించారు. దీంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు.

అదే సమయంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం-2, స్త్రీ శక్తి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదలకు తక్కువ ధరలో భోజనం అందిస్తున్నామని చెప్పారు.

డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో నిలుస్తోందని, లక్షలాది ఉద్యోగాలకు మార్గం సుగమమవుతోందని తెలిపారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని, అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కూడా అభివృద్ధి, సంక్షేమం వైపు నిలబడి రాష్ట్ర పురోగతికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story