Ponnur: ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆధ్యాత్మిక వికాసానికి పెద్దపీట: ధూళిపాళ్ళ!
Ponnur: నియోజకవర్గంలో 5 ఆలయాలకు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తెలిపారు.
Ponnur: ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆధ్యాత్మిక వికాసానికి పెద్దపీట: ధూళిపాళ్ళ!
పొన్నూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వ చొరవతో చేసిన కృషి ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పొన్నూరు నియోజకవర్గంలోని 5 ఆలయాలకు భజన మందిరాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ వారు 10-08-2026న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు, ఇతర గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ నిర్ణయం మేరకు భజన మందిరాల నిర్మాణానికి Type-A, Type-B, Type-C కేటగిరీలకు గరిష్ట వ్యయ పరిమితులను వరుసగా రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షలకు పెంచడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.
పొన్నూరు నియోజకవర్గంలో మంజూరైన ఆలయాల వివరాలు:
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం – అరెమండ గ్రామం, పొన్నూరు రూరల్ మండలం, ఎస్టీ కాలనీ పరిధిలోని ఈ ఆలయానికి Type-A కింద 5.5 సెంట్ల స్థలంలో భజన మందిరం నిర్మాణానికి అనుమతి మంజూరైంది.
శ్రీ రామాలయం – పొన్నూరు రూరల్, 25వ వార్డు ఎస్టీ కాలనీ పరిధిలోని ఈ ఆలయానికి Type-A కింద 5.75 సెంట్ల స్థలంలో భజన మందిరం నిర్మాణానికి అనుమతి లభించింది.
శ్రీ సీతారామ స్వామి ఆలయం – సుద్దపల్లి గ్రామం, చేబ్రోలు మండలం, బీసీ కాలనీ పరిధిలోని ఈ ఆలయానికి Type-A కింద 6.50 సెంట్ల స్థలంలో భజన మందిరం నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరైంది.
శ్రీ రామ & శ్రీ కృష్ణ మందిరం – శేకూరు గ్రామం, చేబ్రోలు మండలం, బీసీ కాలనీ పరిధిలోని ఈ ఆలయానికి Type-C కింద 11 సెంట్ల స్థలంలో భజన మందిరం నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరైంది.
శ్రీ కృష్ణ ఆలయం – వీరనాయకునిపాలెం గ్రామం, చేబ్రోలు మండలం, బీసీ కాలనీ పరిధిలోని ఈ ఆలయానికి Type-C కింద 30 సెంట్ల స్థలంలో భజన మందిరం నిర్మాణానికి అనుమతి లభించింది.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు.
భజన మందిరాల నిర్మాణం పూర్తయిన అనంతరం ఆయా ప్రాంతాల్లో భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
పొన్నూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు కావడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
మంజూరైన నిధులను పనుల పురోగతికి అనుగుణంగా చెల్లించడంతో పాటు, ఆమోదించిన నమూనా ప్రకారం నిర్మాణ పనులను చేపట్టి ఒక సంవత్సరంలోపు పనులను పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ఆదేశించిందని తెలిపారు. నిర్మాణ పనులను సంబంధిత ఇంజినీరింగ్, శిల్పి సిబ్బంది, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు.
పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో భౌతిక మౌలిక వసతులతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతామని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.




