Martur: ప్రతి మహిళా వ్యాపారవేత్తగా ఎదగాలి: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!

Martur: మార్టూరులో 112 మంది డ్వాక్రా మహిళలకు రూ.85 లక్షల విలువైన పంట నూర్పిడి పరదాలను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పంపిణీ చేశారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 28 Aug 2026 11:08 PM IST
Martur
X

Martur: ప్రతి మహిళా వ్యాపారవేత్తగా ఎదగాలి: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!

మార్టూరు: మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఉన్నతి లోన్స్ ద్వారా పరదాల వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.

“ప్రతి మహిళా వ్యాపారవేత్తగా ఎదగాలి.. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలి.. ప్రతి యువతకు ప్రతిభకు తగిన ఉద్యోగం లభించాలి. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యం” అని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.

ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు.

పర్చూరు నియోజకవర్గంలో మహిళా సంఘాలకు ఉన్నతి రుణాల ద్వారా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి కల్పించుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.1,000 కోట్ల మేర డ్వాక్రా రుణాలు అందించామని, ఈ నిధులను మహిళలు సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

112 మంది మహిళలకు రూ.85 లక్షలతో పరదాలు

వ్యవసాయంలో మహిళల శ్రమను తగ్గించి, వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 112 మంది మహిళలకు రూ.85 లక్షల విలువైన పంట నూర్పిడి పరదాలను ఎమ్మెల్యే ఏలూరి పంపిణీ చేశారు. ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి రావడంతో రైతులకు సమయం, శ్రమ ఆదా అవుతుందని, మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

మహిళల చేతుల్లోకి ఆర్థిక వనరులు చేరితే కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

చదువుతోనే జీవితాల్లో వెలుగులు...

చదువు మనిషి జీవన స్థితిగతులను మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని ఎమ్మెల్యే అన్నారు. విద్యావంతులైన యువతకు ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డీఎస్సీ ద్వారా అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకే డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం ముందడుగు వేసిందని ఏలూరి తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారని పేర్కొన్నారు.

అయితే డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ హయాంలో సుమారు 200 కేసులు దాఖలు చేశారని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతిభ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

మహిళలకు రాఖీ శుభాకాంక్షలు...

రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. మహిళల భద్రత, సాధికారత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. పలువురు మహిళలకు ఎమ్మెల్యే ఏలూరి గిఫ్ట్ బాక్సులు అందజేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story