Nandyal: ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం: ప్రారంభించిన ఎంపీ శబరి!
Nandyal: నెహ్రూనగర్‌లో ఎంపీ బైరెడ్డి శబరి చొరవతో, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు.
Nandyal: ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం: ప్రారంభించిన ఎంపీ శబరి!
నంద్యాల జిల్లా: నందికొట్కూరు నియోజకవర్గం, పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో హైదరాబాద్ బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రాయలసీమ ఫౌండేషన్ సహకారంతో ఒక పరీక్షకు రూ. 15 వేల విలువగల ఉచిత క్యాన్సర్ పరీక్షల మహా మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం ప్రారంభ సభలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఇటీవల తాను విజయవాడకు వెళ్లిన సందర్బంలో తెలుగు ప్రజల అభిమాని, హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఎదురు పడగా సార్ మా నంద్యాల జిల్లాలో క్యాన్సర్ రోగ బాధితులు అధికం అని చెప్పగా వెంటనే స్పందించిన హీరో బాలకృష్ణ ప్రత్యేకంగా ఉచితంగా క్యాన్సర్ వైద్య పరీక్షలు చేయిద్దామని తెలిపి అందుకు అవరమైన వైద్య బృందం, విలువైన పరీక్షల ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మా నంద్యాల జిల్లా ప్రజల తరుపున హీరో బాలకృష్ణ కు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
నెహ్రూనగర్ లో మొదటి వైద్య శిబిరం ఏర్పాటుకు కారణం నెహ్రూ నగర్ మాజీ గ్రామ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకులు, హీరో బాలకృష్ణ వీరాభిమాని కట్టుబడి శ్రీనివాస నాయుడు అని, ఆయన పెళ్లి వేడుక కన్నా హీరో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారని, అందువల్లే ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఈ చుట్టు ప్రక్కన పది గ్రామాల వారికి వైద్య సేవలు అందిస్తున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
ఈ ఉచిత వైద్య శిబిరంకు వేలాదిగా తరలివచ్చిన వివిధ గ్రామాల ప్రజలకు, వైద్య సేవలు అందించేందుకు వచ్చిన హైదరాబాద్ బసవతారకం ఇండో - అమెరికన్ వైద్య బృందం, సిబ్బంది, స్థానిక వైద్య బృందం, వాలంటీర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి,రూరల్ సి . ఐ టి.సుబ్రమణ్యం,నందికొట్కూరు హీరో బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షులు తిమ్మారెడ్డి, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ మెంబర్ కురువ రమేష్, టీడీపీ నాయకులు వెంకటేశ్వరశర్మ, బంగారు వెంకటేశ్వర్లు, గుణశేఖర్ రెడ్డి, రఘురామిరెడ్డి, పారుమంచాల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




