Tadepalli: మంగళగిరిలో రూపురేఖలు మారుస్తాం.. మంత్రి నారా లోకేష్

Tadepalli: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో భూగర్భ డ్రైనేజీ పనులకు మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 17 Jun 2026 2:06 PM IST
Tadepalli
X

Tadepalli: మంగళగిరిలో రూపురేఖలు మారుస్తాం.. మంత్రి నారా లోకేష్

తాడేపల్లి: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి తాడేపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ: మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత తనలో మరింత కసి పెరిగిందని, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో విజయం సాధించానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావించి, గెలిచిన మరుసటి రోజు నుంచే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ గ్యాస్ పైప్‌లైన్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ వంటి కీలక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు.

మంగళగిరి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, గ్రంథాలయాల ఆధునీకరణ, పార్కులు, సరస్సులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.

మంగళగిరి భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు చిన్న కార్పొరేషన్‌కు దేశంలోనే అరుదుగా లభించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖపట్నం తర్వాత మంగళగిరికి ఈ ప్రాజెక్టు రావడం అదృష్టకరమని పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించామని, తవ్వకాల అనంతరం రహదారులను 7 రోజుల్లో పూర్తిగా పునరుద్ధరించాలని సూచించినట్లు చెప్పారు.

91 వేలకుపైగా మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానని లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలపడం తన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి విషయానికి వస్తే, గత ప్రభుత్వ హయాంలో పలు పెట్టుబడులు రాష్ట్రాన్ని విడిచిపెట్టాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే దేశంలో వచ్చే ప్రతి ₹100 పెట్టుబడుల్లో సుమారు ₹25 ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా వాతావరణాన్ని సృష్టించిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం, పెన్షన్ల పెంపు, వికలాంగులకు అధిక పెన్షన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రైతులకు సంవత్సరానికి ₹20,000ల ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని, ఎక్కడైనా లోపాలు ఉంటే సూచిస్తే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

డీఎస్సీ నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకత పాటించిందని లోకేష్ స్పష్టం చేశారు. దేశంలోనే మొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్లను సమగ్రంగా అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని మాపై బురద జల్లడమే ప్రత్యేక పనిగా పెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్నానని డిబేట్ కు సిద్ధమని బహిరంగ చర్చకు రావాలని ఏసి రూముల్లో కూర్చొని మాటలు చెప్పడం కాదని అన్నారు కేవలం 150 రోజుల్లో 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.

త్వరలో మరోసారి టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు.

డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం ఇప్పటికే సాంకేతికంగా, చట్టపరంగా సమాధానం ఇచ్చిందని, ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే దానిపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పరిపాలన అనే ఐదు సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story