Guntur: సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై జాతీయ స్థాయి పాదయాత్ర!

Guntur: సోమీ (SOMI), టీఎన్ఏఐ (TNAI) ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుంచి గొరంట్ల వరకు సాధారణ ప్రసవాలపై అవగాహన పాదయాత్ర నిర్వహించారు.

Bakka Deepak, Bapatla
Published on: 22 Nov 2026 9:40 PM IST
Guntur
X

Guntur: సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై జాతీయ స్థాయి పాదయాత్ర!

Guntur: సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సహజ ప్రసవాల పట్ల ఉన్న అపోహలను తొలగించి, వాటిపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జాతీయ స్థాయి అవగాహన పాదయాత్ర నిర్వహించారు. సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా (SOMI) ఆధ్వర్యంలో, ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TNAI) సహకారంతో ఆదివారం (22-11-2026) ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆదివారం ఉదయం 7 గంటలకు గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుంచి ప్రారంభం అయి సహజ ప్రసవాల కోసం జాతీయ స్థాయి

పాదయాత్ర గొరంట్లలోని హోసన్నా మందిరం వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతను తెలియజేసే ప్లకార్డులను చేతబట్టి, సహజ ప్రసవాలను ప్రోత్సహించాలంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్-కమ్-రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సుశీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణ ప్రసవం అనేది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేని సందర్భాల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ ప్రసవం ద్వారా నవజాత శిశువులో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పాటు లభిస్తుందని, తల్లి, బిడ్డ మధ్య భావోద్వేగ అనుబంధం మరింత బలపడుతుందని వివరించారు.

ప్రస్తుత సమాజంలో సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచడం ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి గర్భిణికి ప్రసవ విధానాలపై సరైన సమాచారం అందించాలని, వైద్యుల సూచనలు పాటిస్తూ తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వైద్యపరంగా సాధ్యమైన సందర్భాల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహించడంలో నర్సింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TNAI) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రత్యేక సహకారం అందించింది. పాదయాత్రలో పాల్గొన్న నర్సింగ్ విద్యార్థులందరికీ రిఫ్రెష్‌మెంట్స్ అందించి ప్రోత్సహించింది. TNAI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి శ్రీమతి కె.వి. శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైతం పాదయాత్రలో చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించడంతో పాటు, సహజ ప్రసవాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు.

SOMIతో కలిసి TNAI చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం ద్వారా సాధారణ ప్రసవాలపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు సహజ ప్రసవాల ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిరక్షణలో మిడ్‌వైవ్స్, నర్సింగ్ సిబ్బంది అందించే సేవలు ఎంత కీలకమో ఈ పాదయాత్ర చాటిచెప్పింది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, మిడ్‌వైఫరీ ఎడ్యుకేటర్స్, మిడ్‌వైవ్స్, నర్సింగ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా విద్యార్థులందరూ సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వైద్యపరంగా సాధ్యమైనంత వరకు సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తూ, తల్లి, బిడ్డ ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో అవగాహన కల్పిస్తామని సంకల్పించారు.

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి అవగాహన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla