Ponnur: జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు!
Ponnur: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయం ప్రభుత్వ సంక్షేమానికి నిదర్శనమని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు.
Ponnur: జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు!
Ponnur: పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన తొలి విడత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన ఘన విజయమే రాష్ట్రంలో ప్రజల మద్దతు ఎవరికి ఉందో స్పష్టం చేస్తోందని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లుగా ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు విశ్వసించడం లేదని, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల్లో గెలిచారని ఆరోపణలు చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగినప్పటికీ కూటమి విజయాన్ని జీర్ణించుకోలేక ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల విధానం ఏదైనా ప్రజల తీర్పే అంతిమమని, బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను ఓట్లు అడిగే జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయకుండా వెనుదిరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఓటు వేయాలనే బాధ్యతను విస్మరించిన నాయకుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కడప జిల్లాలో పెద్ద సంఖ్యలో స్థానాలు ఏకగ్రీవం కావడం, మాచర్ల వంటి ప్రాంతాల్లో ప్రత్యర్థి అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడిన ఘటనలు ప్రజలకు గుర్తున్నాయని అన్నారు. గతంలో అధికార బలంతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎన్నికల సంఘం, పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని, ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను రద్దు చేసి, అవసరమైన చోట పోలింగ్ సమయాన్ని పొడిగించడం కూడా ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో భాగమని పేర్కొన్నారు. మాచర్లలో బొండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిషోర్‌లపై జరిగిన దాడులను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, గతంలో వైసీపీ పాలనలో నెలకొన్న రాజకీయ హింసాత్మక పరిస్థితులను ప్రజలు మరచిపోలేదన్నారు.
పులివెందుల వంటి ప్రాంతాల్లో సైతం గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏకగ్రీవాలు, బెదిరింపుల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేసేవారని, ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రతి అభ్యర్థికి పోటీ చేసే అవకాశం, ప్రతి ఓటరుకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉండటమేనని స్పష్టం చేశారు.
పొన్నూరు నియోజకవర్గంలోని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ.. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తుపై, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల కోసం గత రెండేళ్లుగా నిరంతరం పనిచేశామని, రాబోయే మూడేళ్లలోనూ మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల మద్దతుతో స్థానిక సంస్థలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో జిల్లా కమిటీ, పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించి సమన్వయంతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు.
ఎన్నికల కమిటీ సభ్యుల వివరాలు పఠాన్ అహ్మద్ ఖాన్, ఆకుల సాంబశివరావు, జాగర్లమూడి సుధీర్, అలపర్తి చంద్ర మోహన్, వెదురుపర్తి లక్ష్మణ మూర్తి, గోగినేని రజిని మరియు Special invites గా, షేక్ బాజీ సాహెబ్, తానికొండ లక్ష్మినారాయణ, ఎద్దు సోంబాబు, తోటకూర నరేష్ లను నియమించారు.




