Nuzendla: రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాల పంపిణీ
Nuzendla: నూజెండ్ల మండలం తల్లార్లపల్లిలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
Nuzendla: రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాల పంపిణీ
నూజెండ్ల: రైతు భూమికి రక్షణ.. హక్కుకు భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల మండలం తల్లార్లపల్లి గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు చేతిలోని భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది రైతు కుటుంబానికి భరోసా, భవిష్యత్‌కు ఆధారమని అన్నారు. “మీ భూమి – మీ హక్కు” అనే లక్ష్యంతో రైతుల భూములకు రక్షణ కల్పించడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డులను పరిశీలించి, అవసరమైన సవరణలు చేసిన అనంతరం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలు, ప్రభుత్వ పథకాల పత్రాలు, ఇతర ప్రభుత్వ సామగ్రిపై అప్పటి ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించడంపై విమర్శలు వచ్చాయని అన్నారు.
రైతు భూమి రైతుదేనని, అది ఏ ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆస్తి కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారుతుంటాయని.. కానీ రైతు భూమికి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు శాశ్వతంగా, అధికారికంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పత్రాల్లో వ్యక్తిగత ప్రచారానికి బదులుగా అధికారిక రాజముద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై రైతుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయని జీవీ ఆంజనేయులు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ చట్టాన్ని రద్దు చేయడం తమ ఎన్నికల హామీల్లో భాగమని తెలిపారు.
రైతులు తమ భూమిపై హక్కుల విషయంలో ఎలాంటి అనిశ్చితికి గురికాకుండా భూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడం, సర్వేలను ఖచ్చితంగా చేపట్టడం, అవసరమైన రికార్డు సవరణలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రైతు భూమిపై హక్కుకు భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




