Chirala: చీరాలలో కార్డన్ అండ్ సెర్చ్

Chirala: రామ్‌నగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్.. 27 వాహనాలు, నాటు సారా పాత్రలు స్వాధీనం - డీఎస్పీ మోయిన్ హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 May 2026 2:08 PM IST
Chirala
X

Chirala: చీరాలలో కార్డన్ అండ్ సెర్చ్

చీరాల: నాటు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు పాల్పడితే తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ నేతృత్వంలో చీరాల II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్‌లో చీరాల సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ కార్డన్ అండ్ సెర్చ్‌లో చీరాల II టౌన్ ఇన్‌స్పెక్టర్ శశికుమార్, ఇంకొల్లు సీఐ రామనాయక్, చీరాల I టౌన్, II టౌన్, కారంచేడు, చిన్నగంజాం ఎస్‌ఐలు, చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం, 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చీరాల II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.

ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అక్కడ నివసిస్తున్న వ్యక్తుల వివరాలను ఆరా తీసి, వారి గుర్తింపు కార్డులను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే వాహనాలు, వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను కూడా తనిఖీ చేసినట్లు చెప్పారు.

ఈ తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 2 కార్లను, అలాగే నాటు సారా తయారీకి ఉపయోగించే పాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు.

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, నాటు సారా తయారీ, నిల్వ, రవాణా, క్రయవిక్రయాలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎవరైనా అనుమానాస్పదంగా నివసిస్తున్న వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉన్నట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 112కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story