Guntur: గుంటూరులో ఘనంగా పబ్బరాజు జాతీయ పురస్కారాల ప్రదానం!

Guntur: గుంటూరులో స్వర్గీయ పబ్బరాజు వేంకటేశ్వరావు, రాజ్యలక్ష్మి జాతీయ అవార్డులను ఎంపీ భాష్యం రామకృష్ణ ప్రదానం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 11 Oct 2026 11:24 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో ఘనంగా పబ్బరాజు జాతీయ పురస్కారాల ప్రదానం!

గుంటూరు: అంధుల అభ్యున్నతే జీవిత ధ్యేయంగా దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా స్వర్గీయ పబ్బరాజు వేంకటేశ్వరావు వారి సతీమణి రాజ్యలక్ష్మి గుంటూరులో శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి ద్వారా జీవితాంతం అవిరళ కృషి చేశారని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు.

ఈనెల 11వ తేదీన గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో శ్రీ పబ్బరాజు వేంకటేశ్వరావు, రాజ్యలక్ష్మి స్మారక మానవ సేవ జాతీయ పురస్కారం 2026 కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

భాష్యం రామకృష్ణ ప్రసంగిస్తూ స్వర్గీయ పబ్బరాజు వేంకటేశ్వరావు దంపతులు వేలాది అంధుల మరియు దివ్యాంగుల జీవితాలలో అభివృద్ధి సాధించడానికి వారికి ప్రత్యేక పాఠశాలలను స్థాపించి ఆశ్రయం తో పాటు నాణ్యమైన విద్యను అందించారని తత్ఫలితంగా 250 మంది అంధులు మరియు దివ్యాంగులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగలిగారన్నారు.

వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ స్వర్గీయ పబ్బరాజు వేంకటేశ్వరావు 1993లో తహసీల్దార్ గా పదవీ విరమణ చేసి దివ్యాంగుల అభ్యున్నతి కోసం 1995లో శ్రీ షిరిడి సాయి దీన జన సేవా సమితిని ఏర్పాటు చేశారని బ్రెయిలీ లిపిలో విద్య, కంప్యూటర్ పరిజ్ఞానం, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి నైపుణ్యాలను అంధులకు అందించారన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సేవా రంగానికి మంచి గుర్తింపు తెచ్చినారని కరోనా బారిన పడి తన 86వ ఏటా 2021 మే 3న స్వర్ణస్తులైనారని తెలిపారు.

శ్రీ పబ్బరాజు వేంకటేశ్వరావు , రాజ్యలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఆనంగి పూర్ణచంద్రరావు ప్రసంగిస్తూ గత 5 సంవత్సరాలుగా శ్రీ పబ్బరాజు వేంకటేశ్వరావు , రాజ్యలక్ష్మి స్మారక మానవ సేవ జాతీయ పురస్కారాలను ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం దివ్యాంగులకు అత్యున్నత సేవలు అందిస్తున్న వారికి దివ్యాంగులై ఉండి, విద్యావంతులై ఉన్నత స్థానాలకు ఎదిగిన మహనీయులకు అందిస్తున్నామన్నారు.

2026 జాతీయ పురస్కారాలను మద్రాస్ ఐఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా కృషి చేస్తున్న అంధులైన డా|| హేమచంద్ర కరా గారికి మరియు విజయనగరంలోని ప్రఖ్యాత ఎం. ఆర్. సాంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన అంధులైన డా|| కుమార సోమశేఖర్ గారిని సత్కరిస్తున్నామన్నారు. డా|| కుమార సోమశేఖర్ ఆంధ్ర యూనివర్సిటీ ఎల్ఎల్ఎం లో గోల్డ్ మెడల్ సాధించారని 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యున్నత ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందినారని వీరి పర్య వేక్షణలో 20 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలను పొందినారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వేంకటేశ్వర్లు ప్రసంగిస్తూ స్వర్గీయ పబ్బరాజు వేంకటేశ్వరావు తహసీల్దార్ గా రెవెన్యూ ఉద్యోగులకు విశిష్ట సేవలను అందించారని పదవీ విరమణ అనంతరం సేవా రంగాన్ని ఎంచుకుని అంధులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలను జీవితాంతం నిర్వహించిన ధన్యజీవి అని కొనియాడారు.

2026 పురస్కార గ్రహీత డా|| హేమచంద్ర కరా మరియు డా|| కుమార్ సోమశేఖర్ లు ప్రసంగిస్తూ శ్రీ షిరిడి సాయి దీన జన సేవా సమితి 2026 జాతీయ పురస్కారాలకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంధులు తమ వైకల్యాన్ని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విద్య, వ్యాపార, క్రీడ,సంగీత మరియు రాజకీయ రంగాలలో అసాధారణ విజయాలు సాధించి సమాజంలో ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ,పట్టుదలతో ఆశించిన లక్ష్యాలను సాధించినామన్నారు.

సాంకేతికతను వినియోగించుకుని అత్యున్నత స్థాయికి చేరడం గర్వంగా ఉందన్నారు. తొలుత అతిధులందరూ శ్రీ పబ్బరాజు వేంకటేశ్వరావు రాజ్యలక్ష్మి పుణ్య దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ చేతులమీదుగా పురస్కార గ్రహీతలు డా|| హేమచంద్రన్ కరా మరియు డాక్టర్ కుమార సోమశేఖర్ లు కు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నగదు తో పాటు శాలువా కప్పి పూలదండలతో మెమొంటో లు అందించి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల జీవితాలలో మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్న ముంతాజ్ పఠాన్ కు చల్లా భాస్కర లక్ష్మి మెమోరియల్ అవార్డుతో పాటు పదివేల రూపాయల నగదును బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ భువనగిరి శ్రీకృష్ణవేణి, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, శ్రీ షిరిడి సాయి దీన జన సేవా సమితి కార్యదర్శి పన్నాల సత్యనారాయణ మూర్తి మరియు ఉప్పలపాటి మధుసుదన్ రిటైర్డ్ అధ్యాపకులు ఎన్.తిరుపతయ్య మద్దూరి రామకృష్ణ పరమహంస తదితరులు ప్రసంగించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN