Palnadu: పల్నాడులో గ్రామ దేవతల పండగ వేళ ఉద్రిక్తత

Palnadu: పల్నాడు జిల్లాలో బయ్యవరం, మునగోడు గ్రామస్థుల మధ్య కృష్ణానది జలాల ఊరేగింపు విషయంలో తీవ్ర వివాదం రేగింది.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 19 July 2026 11:04 AM IST
Palnadu
X

Palnadu: పల్నాడులో గ్రామ దేవతల పండగ వేళ ఉద్రిక్తత

Palnadu: పల్నాడు జిల్లాలో గ్రామ దేవతల పూజల ఉత్సవాల సందర్భంగా రెండు గ్రామాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. సాంప్రదాయ ఆచారాల నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగా బయ్యవరం, మునగోడు గ్రామస్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

బయ్యవరం గ్రామస్థులు తమ గ్రామ దేవతలకు పవిత్ర జలాలు పోసేందుకు, సాంప్రదాయం ప్రకారం పొలిమేర గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న కృష్ణానదికి బయలుదేరారు. అయితే, బయ్యవరం గ్రామస్థులు తమ గ్రామం మీదుగా నదికి వెళ్తే తమ పొలాల్లో పంటలు పండటం లేదంటూ మునగోడు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బయ్యవరం ప్రజల రాకపోకల వల్ల గ్రామ సెంటిమెంట్‌ దెబ్బతింటుందని పేర్కొంటూ మునగోడు గ్రామస్థులు వారిని సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరు గ్రామాల ప్రజల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు దూషించుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. సమాచారం అందుకున్న పల్నాడు పోలీసులు హుటాహుటిన భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలతో విడివిడిగా మాట్లాడి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు.

పోలీసుల సమయస్ఫూర్తితో కూడిన ఈ చర్యతో ఇరు గ్రామాల మధ్య రేగిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU

Next Story