Vinukonda: కూటమి అభ్యర్థులను భారీగా గెలిపించండి: చీఫ్ విప్ ఆంజనేయులు!

Vinukonda: నవంబర్ 1న జరిగే వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 29 Oct 2026 10:54 PM IST
Vinukonda
X

Vinukonda: కూటమి అభ్యర్థులను భారీగా గెలిపించండి: చీఫ్ విప్ ఆంజనేయులు!

వినుకొండ: నవంబర్ 1న జరగనున్న వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వినుకొండ మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించి చూపిస్తామని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులకు గాను టీడీపీ 29, బీజేపీ 3, జనసేన 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు సుపరిపాలనను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఎన్డీఏ ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఆశిస్తున్నారని పేర్కొన్నారు.

చైర్మన్ అభ్యర్థి చెరుకుపాలెం షమీమ్ ఖాన్‌తో పాటు 36 వార్డుల్లోని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల పెంపు, తల్లికి వందనం, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని జీవీ ఆంజనేయులు తెలిపారు.

రానున్న రోజుల్లో అర్హులకు కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని, టిడ్కో ఇళ్లను నిర్మించి అర్హులకు అందిస్తామని చెప్పారు. ప్రజలకు శాంతియుత పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. హత్యలు, అత్యాచారాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో అభివృద్ధి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేశారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అరాచకం, దౌర్జన్యం వైఎస్సార్‌సీపీ నైజమని విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే అరాచకం, వినాశనం, విధ్వంసానికి మద్దతు ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించారు. హత్యా రాజకీయాలు కావాలా, ప్రజా సంక్షేమం కావాలా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA