Parchur: సాగర్ జలాలతో పర్చూరు నియోజకవర్గ చెరువులకు కొత్త కళ!
Parchur: పర్చూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణే లక్ష్యంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సాగర్ జలాలతో చెరువులను నింపించారు.
Parchur: సాగర్ జలాలతో పర్చూరు నియోజకవర్గ చెరువులకు కొత్త కళ!
పర్చూరు: వేసవి ముంగిటే బీటలు వారే చెరువులు.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం పరుగులు తీసే గ్రామస్తులు.. ఇదొకప్పటి పరిస్థితి. దానికి భిన్నంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో పలు గ్రామాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే ఏలూరి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేశారు.
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణే లక్ష్యంగా ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఎన్‌ఎస్‌పీ శాఖల సమన్వయంతో ఎమ్మెల్యే ఏలూరి స్వయంగా రంగంలోకి దిగారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే గ్రామాల్లో తిరిగి నీటి సమస్యను స్వయంగా అధ్యయనం చేసి, ఏ ఊరికి ఎక్కడి నుంచి నీరు అందించాలో, ఏ చెరువు నింపితే చుట్టుపక్కల గ్రామాలకు మేలు జరుగుతుందో సమగ్రంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అధికార యంత్రాంగంతో అడుగడుగునా సమన్వయం చేసుకుంటూ ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టడంతో ఇవాళ నియోజకవర్గంలోని పలు చెరువులు జలకళను సంతరించుకున్నాయి.
గ్రామాల వారీగా సమస్యల గుర్తింపు.. పరిష్కారానికి కార్యాచరణ
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి పరిస్థితిపై ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక దృష్టి సారించారు. నీటి వనరులు, చెరువులు, కాలువలు, తాగునీటి పథకాల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించారు. ఎక్కడ నీటి కొరత తీవ్రంగా ఉంది? ఏ చెరువును నింపితే భూగర్భ జలమట్టం పెరుగుతుంది? ఏ గ్రామానికి ఏ నీటి వనరు ఉపయోగపడుతుంది? అనే కోణాల్లో అధ్యయనం చేశారు. దీనికి అనుగుణంగా ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్‌ఎస్‌పీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమన్వయం చేస్తూ గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించారు. అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైన చోట్ల నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టారు.
సాగర్ జలాలతో చెరువులకు జీవం
సాగర్ జలాల లభ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపై ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ నీటిని చెరువులకు మళ్లించడం ద్వారా ఒకేసారి తాగునీటి అవసరాలకు భరోసా కల్పించడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా ఎండిపోయిన స్థితిలో ఉన్న పలు గ్రామాల చెరువులు నేడు నీటితో కళకళలాడుతున్నాయి.
మరో వారం సాగర్ నీరు ఇవ్వాలని సీఎం దృష్టికి
సాగర్ జలాల విడుదలను మరో వారం రోజులపాటు పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎమ్మెల్యే ఏలూరి కోరారు. మరికొంతకాలం సాగర్ జలాలు అందుబాటులో ఉంటే నియోజకవర్గంలోని మరిన్ని చెరువులను నింపవచ్చని, తద్వారా రానున్న రోజుల్లో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు భరోసా కల్పించవచ్చని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా పెద్ద చెరువులను నింపేలా సాగర్ జలాలు అందించాలని కోరారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఆదేశిస్తూ చెరువులు నింపేలా చర్యలు
మార్టూరు మండల పరిధిలోని మార్టూరు చెరువును నింపాల్సిన ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరిస్తూ ఆ దిశగా క్షేత్రస్థాయిలో చెరువును ఎమ్మెల్యే ఏలూరి స్వయంగా పరిశీలించి, నింపేలా చర్యలు చేపట్టారు. అలాగే రాజుపాలెం మేజర్ కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించి రాజుపాలెం, జొన్నతాళి చెరువులను నింపేలా కీలక ఆదేశాలు జారీ చేశారు.
బొబ్బేపల్లి, రాజుగారుపాలెం, ద్రోణాదుల చెరువులను నింపేలా ఆయా శాఖల అధికారులతో ప్రతినిత్యం పర్యవేక్షించారు. యద్దనపూడి, గన్నవరం, పోలూరు, శ్యామలవారిపాలెంలో మోటార్లు ఏర్పాటు చేయించి చెరువులు నింపేలా చొరవ చూపారు. నూతలపాడు, పర్చూరు చెరువులకు మొదటి రోజు నుంచే నీరు నింపేలా ప్రణాళికలు రూపొందించారు.
పర్చూరు, వీరన్నపాలెం చెరువులను శుభ్రం చేయించి సాగర్ జలాలతో నింపేలా చొరవ చూపారు. దేవరపల్లి, ఏడారిపల్లి, చింతగుంటపాలెం, నూతలపాడు, నాగులపాలెం, గోరంట్లవారిపాలెం, తిమ్మరాజుపాలెం, కొల్లావారిపాలెం, పెద్దివారిపాలెం చెరువులను నింపేలా చర్యలు చేపట్టారు. ఇంకొల్లు మండలంలో కొనికి చెరువును పూర్తిస్థాయిలో నింపేలా ఆదేశాలు జారీ చేశారు.
నీటి సమస్య కనిపిస్తే.. పరిష్కారం దిశగా అడుగులు
గ్రామాల్లో నీటి సమస్య తలెత్తిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే గుర్తించి అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలన్నదే ఏలూరి కార్యాచరణలోని ప్రధాన ఉద్దేశం. గ్రామాల వారీగా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు చేపడుతున్నారు.
చెరువుల్లోకి చేరుతున్న సాగర్ జలాలు.. గ్రామాల్లో పెరుగుతున్న నీటి భరోసా..
పర్చూరు నియోజకవర్గంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే ఏలూరి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.




