Parchur: రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో కొత్త ఒరవడి ఎమ్మెల్యే ఏలూరి!

Parchur: పర్చూరు టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. రూ.120 కోట్లతో రోడ్లు, రూ.18 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ నిధులపై కీలక ప్రకటన.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 23 July 2026 9:52 AM IST
Parchur
X

Parchur: రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో కొత్త ఒరవడి ఎమ్మెల్యే ఏలూరి!

Parchur: రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో కొత్త ఒరవడి

•వైసీపీ పాలనలో అప్పుల ఊబిలోకి రాష్ట్రం

•ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లండి

•రెండేళ్లలో 120 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణం

•నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశాన్ని ఎమ్మెల్యే ఏలూరి

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు.

ప్రజలు వైసీపీ పాలనపై విసుగెత్తి 2024 ఎన్నికల్లో కూటమికి భారీ మెజార్టీతో విజయం అందించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఉద్యోగులకు రూ.85 వేల కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నట్లు తెలిపారు.

సంక్షేమ పథకాల అమలు....

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛనును రూ.4 వేలకు పెంచిందని, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలోని ప్రతి విద్యార్థికి విద్యా సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు పెట్టుబడి సాయం, ‘దీపం’ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు వివరించారు. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్, రూ.5కే అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. పేదలకు ఐదు లక్షల ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యుత్ చార్జీల పెంపు జరగలేదని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టినట్లు, రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందించినట్లు చెప్పారు.

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.18 కోట్లు...

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా పర్చూరు నియోజకవర్గానికి ఇప్పటివరకు రూ.18 కోట్ల మేర సహాయం మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. క్యాంపు కార్యాలయంలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి అర్హులకు సకాలంలో చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి....

పట్టిసీమ ప్రాజెక్టు వల్ల గోదావరి జలాలు రాయలసీమ ప్రాంతానికి చేరి సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని, ప్రాజెక్టు పూర్తయితే కొమ్మమూరు కాలువ ఏడాది పొడవునా పూర్తిస్థాయిలో నీటితో ప్రవహించే అవకాశం ఉంటుందని తెలిపారు. గుంటూరు ఛానల్ ద్వారా పర్చూరు ప్రాంతానికి గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మౌలిక వసతుల అభివృద్ధి....

‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, గుంతలు లేని రహదారుల లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.80 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. లక్కవరం, జంగమహేశ్వరపురం, చెన్నంబోట్లవారిపాలెం, ఏదుబడి గ్రామాల్లో ఈనాం భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ విజయవంతం చేయాలి..

ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సూచించారు. మృతులు, వలస వెళ్లిన వారి ఓట్ల వివరాలను సేకరించి సంబంధిత అధికారులకు అందించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయాన్ని సాధించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నక్కల రాఘవ, పరిశీలకుడు షేక్ షమీమ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు, పోద వీరయ్య, షేక్ సంసుద్దీన్, తిరుమలశెట్టి శ్రీహరి, ఎన్ఎస్పి ప్రాజెక్టు ఉపాధ్యక్షుడు చక్రపాణి ,కార్పొరేషన్ డైరెక్టర్లు మలెంపాటి చిన్ననారాయణ, కారుమంచి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story