Guntur: గుంటూరు, తెనాలిలో ప్రశాంతంగా ఎన్నికల సామగ్రి పంపిణీ!

Guntur: గుంటూరు కార్పొరేషన్, తెనాలి మున్సిపాలిటీల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి. ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలన.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 31 Oct 2026 1:48 PM IST
Guntur
X

Guntur: గుంటూరు, తెనాలిలో ప్రశాంతంగా ఎన్నికల సామగ్రి పంపిణీ!

Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు తెనాలి మున్సిపాలిటీలలో నవంబరు 1వ తేదీన జరగనున్న పట్టణ స్థానిక ఎన్నికలకు సామాగ్రి పంపిణీ కార్యక్రమం శనివారం ప్రశాంతంగా సాగింది. గుంటూరులో ఆంధ్ర ముస్లిం కళాశాలలో, తెనాలిలో జె ఎం జె మహిళా కళాశాలలో పంపిణీ కార్యక్రమం జరిగింది.

పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది సకాలంలో పంపిణీ కేంద్రానికి చేరుకొని తమ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సామాగ్రిని తీసుకోవడం జరిగింది.

సామగ్రి పంపిణీ రూట్ల వారీగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ సిబ్బంది కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లను చేయడంతో సామాగ్రి తీసుకొని లెక్కలను సరి చూసుకోవడానికి సులభతరమైంది. సిబ్బందికి ఫలహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను చేశారు. రవాణా సౌకర్యాన్ని కల్పించారు.

రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నాయర్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా చివరి వరకు శ్రద్ధ వహించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ మీడియాతో మాట్లాడుతూ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లుచేసామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

గుంటూరు సిటీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గుంటూరు నగరంలోని ఆంధ్రా ముస్లిం కాలేజీలో ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మధ్యాహ్నానికల్లా అన్ని బృందాలు రూట్లన్నీ పరిశీలించుకుని, సాయంత్రానికల్లా కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

తెనాలి మున్సిపాలిటీలో అన్ని వార్డులు మరియు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన రూట్ల వారీగా పంపిణీ జరుగుతుందన్నారు. గుంటూరు, తెనాలి ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరూ ఆదివారం జరిగే పోలింగ్ లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు ఉన్న తమ పోలింగ్ స్టేషన్లకు వచ్చి ప్రశాంతంగా, ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 596 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 4,514 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 185 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 1,185 మంది సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు.

రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 781 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గుంటూరులో 76 వార్డులు, తెనాలిలో 52 వార్డులు కలిపి మొత్తం 128 వార్డులు ఉండగా, తెనాలిలో ఒక వార్డు ఏకగ్రీవమైనందున మిగిలిన 127 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.

గుంటూరు నగరపాలక సంస్థలో 6,18,714 మంది, తెనాలి మున్సిపాలిటీలో 1,57,089 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

పంపిణీ కేంద్రం వద్ద గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN