Guntur: నంబూరులో పంచాయతీ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్ఈసీ పునేఠా!
Guntur: గుంటూరు జిల్లా నంబూరు పంచాయతీలో పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పరిశీలించారు.
Guntur: నంబూరులో పంచాయతీ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్ఈసీ పునేఠా!
Guntur: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామ పంచాయతీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణ తీరు, కౌంటింగ్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నంబూరు లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ... నంబూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరు పోలింగ్ స్టేషన్లను సందర్శించి పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లతో నేరుగా మాట్లాడి పోలింగ్ సరళి, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఫిర్యాదులు, ఇబ్బందులు లేవని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు.
ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో స్వల్ప ఘర్షణలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు సమాచారం అందిందని, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసు శాఖ అదనపు బలగాలను పంపించిందని తెలిపారు.
సమస్యాత్మక గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం తిరిగి పోలింగ్ నిర్వహించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. రెండో విడత (ఫేజ్-2) గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఫేజ్-2లో రాష్ట్రవ్యాప్తంగా 4,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను ఈరోజు సాయంత్రం, రాత్రి లోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అనంతరం నంబూరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిశీలించారు. కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. నంబూరు మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ తదితరులు పాల్గొన్నారు.




